Telugu Global
Family

దేవుడిచ్చిన వయసు (Devotional)

            ప్రవహించే నదుల్తో, పచ్చ పచ్చని చెట్లతో, పర్వతాలతో నిండిన ప్రపంచాన్ని దేవుడు సృష్టించాడు. తన సృష్టిని చూసి దేవుడు ఎంతో ఆనందించాడు. సృష్టి కార్యం కొనసాగటానికి ఒక కుక్కను, గాడిదను, కోతిని, మనిషిని పుట్టించాడు. ప్రపంచం కలకలంతో నిండింది.             మొదట దేవుడు కుక్కను పిలిచాడు. కుక్క వచ్చింది. “స్వామీ! నన్ను పుట్టించారు, బాగానే ఉంది నేనేం చెయ్యాలీ ప్రపంచంలో” అని అడిగింది.             దేవుడు “నేను సృష్టించిన ప్రతిదానికీ ఒక ప్రయోజనముంటుంది. నిన్నూ అలాగే […]

ప్రవహించే నదుల్తో, పచ్చ పచ్చని చెట్లతో, పర్వతాలతో నిండిన ప్రపంచాన్ని దేవుడు సృష్టించాడు. తన సృష్టిని చూసి దేవుడు ఎంతో ఆనందించాడు. సృష్టి కార్యం కొనసాగటానికి ఒక కుక్కను, గాడిదను, కోతిని, మనిషిని పుట్టించాడు. ప్రపంచం కలకలంతో నిండింది.

మొదట దేవుడు కుక్కను పిలిచాడు. కుక్క వచ్చింది. “స్వామీ! నన్ను పుట్టించారు, బాగానే ఉంది నేనేం చెయ్యాలీ ప్రపంచంలో” అని అడిగింది.

దేవుడు “నేను సృష్టించిన ప్రతిదానికీ ఒక ప్రయోజనముంటుంది. నిన్నూ అలాగే పుట్టించాను.

నువ్వు కావలి కాయాలి. విశ్వాసంతో మెలగాలి. ప్రాణుల్ని వస్తువుల్ని కనిపెట్టివుండాలి” అన్నాడు.

కుక్క “అలాగే స్వామీ! మీరు చెప్పినట్లే చేస్తాను. ఇంతకూ నాకు వయసెంత ఇచ్చారు” అని అడిగింది.

దేవుడు “ముప్పయ్యేళ్ళ వయసిచ్చాను” అన్నాడు. కుక్క “స్వామీ! ఈ కుక్క బతుక్కి అంత వయసెందుకు? దయచేసి తగ్గించండి” అంది. దేవుడు పదేళ్ళే ఇచ్చి పంపేశాడు.

గాడిద వచ్చింది. దేవుడు నువ్వు బరువులు మొయ్యాలని దాని బాధ్యతలు వివరించాడు. గాడిద సరే అని “స్వామీ! నాకు వయసెంత ఇచ్చా”రంది. దేవుడు “ముప్పయేళ్ళన్నాడు”. గాడిద వినయంగా “స్వామీ! ఈ గాడిద చాకిరీకి ఇంత వయసెందుకు? తగ్గించండి” అంది. దేవుడు ఇరవయ్యేళ్ళు తన దగ్గరుంచుకుని పదేళ్ళ వయసే ఇచ్చి పంపేశాడు. గాడిద ఆనందంగా వెళ్ళిపోయింది.

తరువాత కోతి వచ్చింది. తన బాధ్యత ఏమిటని అడిగింది. దేవుడు “నువ్వు వచ్చేపొయ్యే వాళ్ళని చూసి వెక్కిరిస్తూ జీవించాలి” అన్నాడు. కోతి “సరే స్వామీ! మీరెట్లా ఆజ్ఞాపిస్తే అలాగే, ఇంతకూ నాకు వయసెంత ఇచ్చారు?” అని అడిగింది. దేవుడు “ముప్పయ్యేళ్ళ వయసిచ్చాను” అన్నాడు. కోతి దిగాలు పడి “స్వామీ! ఈ కోతిపనులకు అంతవయసెందుకు? తగ్గించండి” అంది. దేవుడు సరే అని పదేళ్ళ వయసిచ్చి పంపేశాడు.

చివర్న మనిషి వచ్చాడు. దేవుడికి నమస్కరించాడు. దేవుడు మనిషిని చూసి చిరు నవ్వు నవ్వాడు. “నిన్నెందుకు పుట్టించానో తెలుసా?” అన్నాడు. మనిషి తెలీదన్నాడు. దేవుడు ప్రపంచాన్ని చూపించి “ఈ నదులు చెట్లు పర్వతాలూ సమస్త ప్రకృతినీ నీకోసం సృష్టించాను. ఇదంతా నీదే. వెళ్ళు, ఆనందించు, అనుభవించు” అన్నాడు. ఆ మాటలకి మనిషి పొంగిపోయాడు. తన పట్ల అంత ప్రేమ చూపినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.

“మంచిది దేవా! ఇంతకూ నాకు వయసెంత ఇచ్చారు?” అని అడిగాడు. దేవుడు “ముప్పయ్యేళ్ళు” అన్నాడు. ఆ మాటలతో మనిషి నీరసించిపోయాడు. నిరాశగా దేవుణ్ణి చూసి “స్వామీ! ఇంత గొప్ప ప్రపంచాన్ని నాకిచ్చి అనుభవించమని కేవలం ముప్పయ్యేళ్ళిచ్చి వెళ్ళమనడం అన్యాయం” అన్నాడు. “అదంతేనయా! అంతకు మించి ఇవ్వడం వీలుపడదు” అన్నాడు దేవుడు. మనిషి అమాంతంగా దేవుడి కాళ్ళు పట్టుకుని దీనంగా వయసు పెంచమని వేడుకున్నాడు. “వీలు కాదయ్యా” అని దేవుడు ఎంత చెప్పినా కాళ్ళు వదిలి పెట్టలేదు. దేవుడికి విసుగు వచ్చి గాడిద నించి తీసుకున్న ఇరవయ్యేళ్ళిచ్చాడు. మనిషి ఇంకాఇంకా కావాలనడంతో కుక్క నించి, కోతి నించీ తీసుకున్న వయసునూ ఇస్తున్నా నన్నాడు. కానీ మనిషి ఇంకా ఇంకా అని ఆశగా అడిగాడు. దేవుడికి చిరాకు వేసి మనిషిని విదిలించాడు. మనిషి వచ్చి లోకంలో పడ్డాడు.

అప్పటి నించీ దేవుడిచ్చిన ముప్పయ్యేళ్ళ వయసు ఏదయితేవుందో అంతవరకూ దేవతలా ఆనందంగా జీవిస్తాడు. కష్టాలు వచ్చినా వాటన్నిట్లోనూ కళకళలాడుతూ జీవిస్తాడు. ముప్పయి వస్తున్నప్పుడు పెళ్ళి అవుతుంది. పిల్లలు పుడతారు. ఆ కుటుంబం పట్ల ఇరవయి సంవత్సరాలు గాడిద చాకిరీ చేసి వీలయినంత కూడ బెడతాడు. తరువాత ఇరవయి సంవత్సరాలు సంపాదించిన ఆ డబ్బును కుక్కలా కావలికాస్తాడు. ముసలాడయ్యాకా కుర్రాళ్ళని చూసి కోతిలా వెక్కిరిస్తూ ఇరవయ్యేళ్ళు గడుపుతాడు. ఇలా జీవితం ముగిసిపోతుంది.

దేవుడిచ్చిన ముప్పయ్యేళ్ళు ఏవయితే ఉన్నాయో వాటిలో మాత్రమే స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, ఆనందం, స్వర్గం ఉన్నాయి.

– సౌభాగ్య

First Published:  9 May 2015 1:01 PM GMT
Next Story