Telugu Global
Others

డిపోల్లోనే నిలిచిపోయిన ఆర్టీసీ ప్ర‌గ‌తి ర‌థ చ‌క్రాలు

ఎక్క‌డి బ‌స్‌లు అక్క‌డే బంద్‌ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ర్టాల్లో ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. 43 శాతం ఫిట్‌మెంట్‌ను డిమాండ్‌ చేస్తూ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. రెండు ద‌ఫాలుగా ఆర్టీసీ యాజ‌మాన్యం, కార్మిక సంఘాలు జ‌రిపిన చ‌ర్చ‌లు విఫ‌ల‌మ‌వ‌డంతో స‌మ్మె బాట ప‌ట్టారు. దీంతో బుధవారం తెల్లవారుజాము నుంచి బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. స‌మ్మెకు ఈయూ, టిఎంయూ పిలుపు ఇవ్వ‌గా ఆర్టీసీ ఎన్‌ఎంయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ మద్దతు తెలిపాయి. న‌ష్టాల్లో ఉన్న ఆర్టీసీకి వేత‌నాల పెంపు […]

డిపోల్లోనే నిలిచిపోయిన ఆర్టీసీ ప్ర‌గ‌తి ర‌థ చ‌క్రాలు
X

ఎక్క‌డి బ‌స్‌లు అక్క‌డే బంద్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ర్టాల్లో ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. 43 శాతం ఫిట్‌మెంట్‌ను డిమాండ్‌ చేస్తూ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. రెండు ద‌ఫాలుగా ఆర్టీసీ యాజ‌మాన్యం, కార్మిక సంఘాలు జ‌రిపిన చ‌ర్చ‌లు విఫ‌ల‌మ‌వ‌డంతో స‌మ్మె బాట ప‌ట్టారు. దీంతో బుధవారం తెల్లవారుజాము నుంచి బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. స‌మ్మెకు ఈయూ, టిఎంయూ పిలుపు ఇవ్వ‌గా ఆర్టీసీ ఎన్‌ఎంయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ మద్దతు తెలిపాయి. న‌ష్టాల్లో ఉన్న ఆర్టీసీకి వేత‌నాల పెంపు పెను భార‌మ‌వుతుంద‌ని యాజ‌మాన్యం చెబుతుండ‌గా… రాష్ట్ర ప్ర‌భుత్వాల ఉద్యోగుల‌కు ఇచ్చిన ఫిట్‌మెంట్ త‌మ‌కు ఎందుకు వ‌ర్తింప‌జేయర‌ని కార్మిక సంఘాలు ప్ర‌శ్నిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌ : విజయవాడలో సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. కృష్ణా రీజియన్‌లో 1400 సర్వీసులు, పగో జిల్లాలోని 7 డిపోల్లో 800 సర్వీసులు, తూగో జిల్లా వ్యాప్తంగా 840 సర్వీసులు, ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 700 సర్వీసులు, విశాఖ రీజియన్‌లో 900 ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. విశాఖ రీజియన్‌లో 5600 మంది కార్మికులు సమ్మెలోకి దిగారు. మరోవైపు నర్సీపట్నం ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన తాత్కాలిక నియామకాలకు భారీగా నిరుద్యోగులు తరలివచ్చారు. కర్నూలు జిల్లాలో 5 వేల మంది ఆర్టీసీ సిబ్బంది విధులకు హాజరుకాలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. చిత్తూరు జిల్లా 1400 సర్వీసులు నిలిచిపోయాయి. అయితే సమ్మె నుంచి తిరుమలకు మినహాయింపు ఇచ్చినప్పటికీ బస్సులు నామమాత్రంగా తిరుగుతున్నాయి. గుంటూరు జిల్లాలో 12 డిపోల్లో 1235 బస్సులు నిలిచిపోయాయి. సమ్మెలో 6300 మంది కార్మికులు పాల్గొంటున్నారు. రాష్ట్రంలోని అన్ని డిపోల ఎదుట కార్మికులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతుండగా ఆర్టీసీ అధికారులు మాత్రం ప్రత్యామ్మాయ ఏర్పాట్లు చేశామని చెబుతున్నారు.
తెలంగాణ : ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా స‌మ్మె ప్ర‌భావం బాగా క‌నిపించింది. హైదరాబాద్‌లో సమ్మె కారణంగా డిపోల నుంచి బస్సులు బయటకు రాలేదు. సమ్మెకు ఎన్‌ఎమ్‌యూ, ఎస్‌డబ్ల్యూఎస్‌ మద్దతు తెలిపాయి. కూకట్‌పల్లిలో 137 సర్వీసులు డిపోలో నిలిచిపోయాయి. క‌ుషాయిగూడ పరిధిలో 200 బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. ఖమ్మం జిల్లాలో సమ్మె కారణంగా 640 సర్వీసులు డిపోలకే పరిమితమయ్యాయి. భద్రాచలం డిపో పరిధిలో 120 బస్సులు, ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా 750 బస్సులు నిలిచిపోయాయి. జిల్లాలో 9 డిపోల పరిధిలో 4500 మంది కార్మికులు సమ్మెలోకి దిగారు. మెదక్‌ జిల్లా వ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఏడు డిపోల పరిధిలో 670 సర్వీసులు నిలిచిపోయాయి. నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. దీంతో ఏడు డిపోల్లో 700 సర్వీసులు నిలిచిపోయాయి. ర‌‌ంగారెడ్డి జిల్లా ఇబ్రహింపట్నంలో సమ్మె కారణంగా 150 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో 8 డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి. కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా 11 డిపోల్లో 950 బస్సులు నిలిచిపోయాయి. తాత్కాలిక డ్రైవర్లను కార్మికులు అడ్డుకున్నారు. నెల్లూరు జిల్లాలో సమ్మె కారణంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 10 డిపోల్లో 838 బస్సులు నిలిచిపోయాయి. నిజామాబాద్‌ జిల్లాలో 6 డిపోల్లో 656 బస్సులు నిలిచిపోయాయి.
సమ్మెకు దూరంగా కార్మిక పరిషత్‌
కార్మిక పరిషత్‌ నేతలతో ఏపీ రవాణా మంత్రి శిద్దా రాఘవరావు, ఆర్టీసీ ఎండీ సాంబశివరావు మంగళవారం సాయంత్రం సచివాలయంలో చర్చించారు. సంస్థ మనుగడ కోసం సహకరించాలని, సమ్మెకు వెళితే నష్టపోవడం మినహా సాధించేది ఉండదని కార్మిక పరిషత్‌ ప్రధాన కార్యదర్శి వీవీ నాయుడుకు వివరించారు. ‘‘ఆర్టీసీ చరిత్రలో ఎప్పుడైనా 27 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చారా? నష్టాల్లో ఉన్నప్పటికీ కార్మికుల కోసం భారం భరిస్తున్నాం. అయినా… ఈయూ, ఎన్‌ఎంయూ మొండికేస్తున్నాయి, మీరు సహకరించండి’’ అని కోరారు. వేసవి సెలవులు, రెండు రాష్ట్రాల్లో పెళ్లిళ్లు జరుగుతున్న సమయంలో సంస్థపై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేందుకు సహకరించాలన్నారు. కానీ… కార్మిక పరిషత్‌ నేతలు స్పష్టమైన సమాధానం చెప్పకుండా, ముఖ్యమంత్రితో తమకు సమయం ఇప్పించాలని కోరారు. సీఎం హామీ మేరకు తాము నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతానికి సమ్మెకు దూరంగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఆర్టీసీ ప్ర‌త్య‌మ్నాయ ఏర్పాట్లు
తెలుగు రాష్ర్టాల్లో ఆర్టీసీ కార్మికులు సమ్మె నేపథ్యం ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లు, కండక్లర్లను నియామకానికి పూనుకుంది. కండక్లర్లుగా టెన్త్‌ పాసైనవారు, హెవీ లైసెన్స్‌ కలిగిన డ్రైవర్ల నియామకానికి ఆర్టీసీ ఆదేశాలు జారీ చేసింది. డ్రైవ‌ర్‌కు రోజుకు రూ.వెయ్యి చొప్పున, కండ‌క్ట‌ర్‌కు రోజుకు రూ. 800 చొప్పున భత్యం ఇవ్వాలని నిర్ణయించింది. రెగ్యులర్‌ నియామకాల్లో 5 శాతం వెయిటేజీ ఇస్తామని ఆర్టీసీ ప్రకటించింది.
Next Story