ముఖం చాటేసిన మోడి: హీరో శివాజీ తీవ్ర విమర్శలు
భారతీయ జనతాపార్టీ తెలుగుజాతిని నిలువెల్లా మోసం చేసిందని, ఈ పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో ఆదరణ లభించదని హీరో శివాజీ అన్నారు. మూడు రోజులుగా నిరాహార దీక్షలో ఉన్న ఆయన బీజేపీని, కేంద్రంలో ఆ పార్టీ ప్రభుత్వాధినేత మోడిని తీవ్రంగా విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే ఢిల్లీ ప్రజలు కుళ్ళుకునేలా అద్భుతమైన రాజధాని నిర్మిస్తామంటూ మోడీ కల్లబొల్లి కబుర్లు చెప్పారని, ఇపుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటే మరిచిపోయారని ఆయన అన్నారు. ఏపీ వైపు ఆయన కన్నెత్తి కూడా […]
BY Pragnadhar Reddy5 May 2015 7:31 AM IST
X
Pragnadhar Reddy Updated On: 5 May 2015 7:31 AM IST
భారతీయ జనతాపార్టీ తెలుగుజాతిని నిలువెల్లా మోసం చేసిందని, ఈ పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో ఆదరణ లభించదని హీరో శివాజీ అన్నారు. మూడు రోజులుగా నిరాహార దీక్షలో ఉన్న ఆయన బీజేపీని, కేంద్రంలో ఆ పార్టీ ప్రభుత్వాధినేత మోడిని తీవ్రంగా విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే ఢిల్లీ ప్రజలు కుళ్ళుకునేలా అద్భుతమైన రాజధాని నిర్మిస్తామంటూ మోడీ కల్లబొల్లి కబుర్లు చెప్పారని, ఇపుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటే మరిచిపోయారని ఆయన అన్నారు. ఏపీ వైపు ఆయన కన్నెత్తి కూడా చూడడం లేదని అన్నారు. ఇక కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆనాడు పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్‌కు పదేళ్ళపాటు ప్రత్యేక హోదా కావాలని డిమాండు చేశారని… ఇపుడు ఆ విషయంలో మొగం చాటేసుకు తిరుగుతున్నారని, వీరిని తెలుగుజాతి క్షమించదని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చీల్చి తాము అధికారంలోకి రావాలని బీజేపీ కలలు కంటుందని ఆయన ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తప్ప బీజేపీకి ఆదరణ లభించడం కష్టమని ఆయన అన్నారు. తెలుగుదేశం, పవన్ కల్యాన్‌లు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తే తామంతా మద్దతిస్తామని ఆయన అన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరూ ప్రత్యేక హోదా కోసం ప్రయత్నించాలని ఆయన కోరారు. తెలుగు జాతి నిర్వీర్యం కాకుండా ఉండేందుకే తాను నిరాహార దీక్షకు దిగానని, తనకు లభిస్తున్న మద్దతు చూస్తే ప్రత్యేక హోదా కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో అర్ధమవుతుందని ఆయన అంటూ తాను చనిపోయే వరకు దీక్ష కొనసాగిస్తానని, మధ్యలో ఆపే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
హీరో శివాజీ ఆరోగ్యం క్షీణించక ముందే ప్రత్యేక హోదా ప్రకటన చేయాలని మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు అన్నారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అడగడం హక్కుగా గుర్తించాలని ఆయన అన్నారు. ప్రతీ మండలంలోను శివాజీకి మద్దతుగా నిరాహార దీక్షలు, ర్యాలీలు చేసి ఉద్యమానికి ఊపు ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. కాగా శివాజీ దీక్షపై ఎంపీ మాగంటి బాబు మాట్లాడుతూ తాము రకరకాల మార్గాల ద్వారా ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తున్నామని, శివాజీ దీక్ష కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి ఉపయోగపడుతుందని అన్నారు.
Next Story