Telugu Global
Others

సాగుతున్న ఎర్ర'ఇమేజ్‌' సీరియల్‌ !

‘కర్నూలు జిల్లాలో వైసిపి నేతకు ఎర్ర దొంగలతో సంబంధాలు’ ‘హతుల సెల్‌ఫోన్‌ల ఆధారంగా ఎర్ర స్మగ్లర్ల గుర్తింపు’ ‘తమిళనాడు మాజీ మంత్రికి ఎర్ర స్మగ్లింగ్‌తో సంబంధం-త్వరలోనే గుట్టురట్టు’ ‘పశ్చిమబంగ నేతలకూ ఎర్ర చందనం స్మగ్లింగ్‌తో సంబంధం’ ‘సోమశిలలో కోట్ల విలువైన ఎర్ర దుంగలు’ ఈ తరహా కథనాలు ఎన్‌కౌంటర్‌ తర్వాత రోజూ పత్రికల్లో ప్రముఖంగా వస్తున్నాయి. ఇదంతా ఎందుకు వస్తోందంటే ఎర్ర చందనం స్మగ్లింగ్‌ వెనుక పెద్దఎత్తున మాఫియా, నేతలు ముఖ్యంగా వైసిపి, డిఎంకె తదితర పార్టీలవారు ఉన్నట్లు, […]

సాగుతున్న ఎర్రఇమేజ్‌ సీరియల్‌ !
X

‘కర్నూలు జిల్లాలో వైసిపి నేతకు ఎర్ర దొంగలతో సంబంధాలు’
‘హతుల సెల్‌ఫోన్‌ల ఆధారంగా ఎర్ర స్మగ్లర్ల గుర్తింపు’
‘తమిళనాడు మాజీ మంత్రికి ఎర్ర స్మగ్లింగ్‌తో సంబంధం-త్వరలోనే గుట్టురట్టు’
‘పశ్చిమబంగ నేతలకూ ఎర్ర చందనం స్మగ్లింగ్‌తో సంబంధం’
‘సోమశిలలో కోట్ల విలువైన ఎర్ర దుంగలు’

ఈ తరహా కథనాలు ఎన్‌కౌంటర్‌ తర్వాత రోజూ పత్రికల్లో ప్రముఖంగా వస్తున్నాయి. ఇదంతా ఎందుకు వస్తోందంటే ఎర్ర చందనం స్మగ్లింగ్‌ వెనుక పెద్దఎత్తున మాఫియా, నేతలు ముఖ్యంగా వైసిపి, డిఎంకె తదితర పార్టీలవారు ఉన్నట్లు, తీవ్ర స్ధాయిలో అక్రమాలు సాగుతున్నందునే ప్రభుత్వం అదే స్ధాయిలో ఎన్‌కౌంటర్‌తో స్పందించాల్సి వచ్చిందని నమ్మించడానికి చేస్తున్న ప్రయత్నాలు మాత్రమే.

ఏప్రిల్‌ 7 తెల్లవారు జామున శేషాచలం కొండల్లో ఎస్‌టిఎఫ్‌ పోలీసులు 20 మంది కూలీలను మట్టుబెట్టారు. ఎపి రాష్ట్ర ప్రభుత్వం తన ఇమేజ్‌ను పెంచుకునేందుకు ఎర్ర దొంగలపేరుతో కూలీలను ఎన్‌కౌంటర్‌ పేరుతో హతమార్చటం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించి ప్రభుత్వం పరువు శేషాచలం కొండలపాలు కావటంతో ప్రతిష్టను పెంచుకునేందుకు పడరానిపాట్లు పడుతోంది. ఈ వ్యవహారం హైకోర్టు, సుప్రీంకోర్టులతోపాటు రాజ్యసభ, లోక్‌సభలకు చేరటమే కాకుండా జాతీయ మానవహక్కుల సంఘం, జాతీయ ఎస్టీఎస్సీ కమిషన్‌ రంగంలోకి దిగి దర్యాప్తు క్షేత్రస్థాయిలోనూ పూర్తిచేయటంతో ఓ బలమైన వర్గం మీడియా అండదండలతో పోయిన ప్రతిష్టను వివిధ రూపాలలో తెచ్చిపెట్టుకునేందుకు తంటాలుపడుతోంది. అందులో భాగంగానే ఇదంతా కృత్రిమంగా, కృతక ప్రయత్నంగా స్పష్టంగానే కనిపిస్తున్నప్పటికీ ఎర్రదొంగలను మట్టుబెట్టే క్రమంలోనే రాష్ట్రప్రభుత్వం ఈ ఎన్‌కౌంటర్‌కు పాల్పడిందనే అభిప్రాయం కల్పించటానికి ఈ కసరత్తు తప్పటంలేదని ఓ ఉన్నత పోలీసు అధికారి నిట్టూర్చారు. అమాయక కూలీలను హతమార్చిన విషయంలో ప్రభుత్వం పీకలలోతు కష్టాలలో కూరుకుపోయింది. అసలు సిసలైన ఎన్‌కౌంటర్‌ అని నమ్మించటం సాధ్యంకాదు. ముఖ్యంగా జాతీయ మానవహక్కుల సంఘం, జాతీయ ఎస్టీఎస్సీ కమిషన్‌ బూటకపు ఎన్‌కౌంటర్‌గా నిర్ణయానికి దాదాపుగా వచ్చాయి. దీనిపై ఏర్పాటైన సిట్‌ను హైకోర్టు తన పరిధిలోకి తీసుకుంది.

ఈ పరిస్థితుల్లో తమ ముందున్న కర్తవ్యం…. ఎర్ర దుంగల అక్రమ రవాణాలో పెద్దల హస్తముందని నిరూపించాలి. అందుకోసం ఎంతో కొంత ఆధారాలను చూపించాలి. ప్రధాన అక్రమ సరఫరా దారునిగా ప్రాచుర్యం పొందిన కడప జిల్లాకు చెందిన గంగిరెడ్డి ఎప్పుడో విదేశాలకు పారిపోయి అక్కడే అరెస్ట్‌ అయ్యాడు. వైసిపికి చెందిన అతను ఇక్కడే ఉండి ఉంటే తాజాగా జరిగిన అక్రమాలన్నింటినీ పోలీసులు అతనిఖాతాలో వేసేవారు. ఇక మిగిలిందల్లా మస్తాన్‌ వలి. ఇతను కూడా వైసిపిలో ఉంటూ చాగలమర్రి మండల ఎంపిపిగా ఎన్నికయ్యాడు. కోటి రూపాయల వరకూ వెచ్చించి ఎన్నికయ్యాడని చెబుతుంటారు. అప్పటికే రెండు పెళ్ళిళ్ళు చేసుకున్న ఇతగాడు ఓ సినిమాకూడా తీశాడు. అందులో హీరోయిన్‌గా నటించిన నటిని పెళ్ళికూడా చేసుకున్నాడట. ఇతనిపై 12 వరకూ చిన్నాచితక కేసులు ఉన్నాయి. గత స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనూ అరెస్ట్‌యి మళ్ళీ విడుదల అయ్యాడు. విధిలేని పరిస్థితుల్లో పోలీసులు తమ ఇమేజ్‌ను కాపాడుకునేందుకు మస్తాన్‌వలిపై పంజా విసిరారు. ఇంకేముంది బడా స్మగ్లర్‌ ముద్రవేసి అతన్ని, అతని సహచరణిలను పోలీసులు అత్యంత చాకచక్యంగా అరెస్ట్‌ చేశారు. అతనికి హైదరాబాద్‌, బెంగుళూరుల్లో పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నాయని పోలీసుల ప్రచారం. ఇతను నేరాగాడు కాదని కాదు. అక్రమంగా సంపాదించలేదని అంతకన్నా కాదు. కాని తీరా చూస్తే అతనేమీ వేల టన్నులు అక్రమంగా ఎగుమతిచేసి వందల కోట్లు ఏమీ ఆర్జించలేదు. అయితే అతన్ని బడా స్మగ్లర్‌గా చిత్రిస్తున్నారు మన పోలీసులు. అదే సమయంలో అతని సహచరిణి తన బ్యాంక్‌ ఖాతా నుంచి లక్షన్నర రూపాయలు మరొకరికి బదలాయించింది. దాంతో ఆమె కూడా నేరంతో సంబంధం ఉన్నట్లు కేసు బనాయించి అరెస్ట్‌ చేశారు. ఈ జంటకు నేరంతో సంబంధం ఉండవచ్చు. కాదనలేం. కాని పోలీసులు తమ ప్రతిష్టను కాపాడుకునేందుకు బడా చోర్‌లుగా చిత్రికరించేశారు. ఎందుంటే కూలీలను హతమార్చటాన్ని సమర్దించుకోవడానికి పెద్ద పెద్ద నేతలు దీని వెనుక ఉన్నట్లు, వేల టన్నులు అక్రమంగా తరలిపోయినట్లు చూపించాలి. ఆ ప్రయత్నాలను….’కర్నూలు జిల్లాలో వైసిపి నేతకు నేరుగా సంబంధాలు’, ‘హతుల సెల్‌ఫోన్‌ల ఆధారంగా స్మగ్లర్ల గుర్తింపు’, ‘తమిళనాడు మాజీ మంత్రికి ఎర్ర చందనం స్మగ్లింగ్‌తో సంబంధం-త్వరలోనే గుట్టురట్టు’ లాంటి లీకులతో కొంతకాలం సాగించారు. అవి నిజమోకాదో తెలియదు. కాని వారిని పట్టుకోలేకపోయారు. దాంతో దొరికిన చోటా స్మగ్లర్‌ మస్తాన్‌, అతని సహచరణి నీతూ అగర్వాల్‌లే ఇప్పటికి గజదొంగలుగా మనం భావించాలి. వారి వల్లనే ఎర్ర చందనం వనాలు అంతరించి పోయాయి. వారి అక్రమ రవాణాను అరికట్టేందుకే ఎస్‌టిఎఫ్‌ దళాలు వారి కోసం పనిచేస్తున్న 20 మందిని మట్టుబెట్టాయని మనం నమ్మాలి. అప్పుడే ప్రభుత్వ ప్రతిష్ట పెరుగుతుందట. ఇది పోలీసుల స్క్రిప్ట్‌ !

First Published:  1 May 2015 11:25 AM IST
Next Story