Telugu Global
Others

నిజాం చక్కెర ఫాక్టరీకి పూర్వ వైభవం!

సర్వత్రా ప్రైవేటీకరణ మంత్ర జపమే వినిపిస్తున్న తరుణంలొ ప్రైవెటు రంగానికి అప్పగించిన పరిశ్రమను మళ్లీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం అపురూపమే. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలోని బోధన్ లో ఉన్న నిజాం డక్కన్ సుగర్స్ లిమిటెడ్ కంపెనీని స్వాధీనం చేసుకోవాలని కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం బుధవారం నాడు నిర్ణయించింది. బోధన్ లోని షక్కర్ నగర్ లో ఉన్న ఈ పరిశ్రమను నిజాం సుగర్ ఫాక్టరీ అంటారు. దీనికి మహత్తరమైన చరిత్ర ఉంది. హైదరాబాద్ సంస్థానంలో పారిశ్రామికీకరణకు చిహ్నాలలో నిజాం […]

నిజాం చక్కెర ఫాక్టరీకి పూర్వ వైభవం!
X

RV Ramaraoసర్వత్రా ప్రైవేటీకరణ మంత్ర జపమే వినిపిస్తున్న తరుణంలొ ప్రైవెటు రంగానికి అప్పగించిన పరిశ్రమను మళ్లీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం అపురూపమే. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలోని బోధన్ లో ఉన్న నిజాం డక్కన్ సుగర్స్ లిమిటెడ్ కంపెనీని స్వాధీనం చేసుకోవాలని కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం బుధవారం నాడు నిర్ణయించింది.

బోధన్ లోని షక్కర్ నగర్ లో ఉన్న ఈ పరిశ్రమను నిజాం సుగర్ ఫాక్టరీ అంటారు. దీనికి మహత్తరమైన చరిత్ర ఉంది. హైదరాబాద్ సంస్థానంలో పారిశ్రామికీకరణకు చిహ్నాలలో నిజాం చక్కెర కర్మాగారం మకుటాయమానమైంది. హైదరాబాద్ సంస్థానాన్ని ఏలిన ఆఖరి నిజాం మీర్ ఒస్మాల్ అలీ ఖాన్ 1921లో ఈ చక్కెర కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు. 1500 ఎకరాలలో ఈ కర్మాగారం నెలకొల్పారు. ఆ ప్రాంతానికి షక్కర్ నగర్ అని పేరు పెట్టారు. ఒకప్పుడు ఇది ఆసియాలోకెల్ల పెద్ద చక్కెర కర్మాగారం. కొంత కాలం తర్వాత నిజాం చక్కెర కర్మాగారాన్ని విస్తరించి మెదక్, కరీంనగర్ జిల్లాల్లో కూడా శాఖలు ఏర్పాటు చేశారు. ఈ పరిశ్రమకు సొంత భూములూ ఉన్నాయి. నిజామాబాద్, మెదక్ జిల్లాలలో చెరకు పంటకు ప్రాధాన్యం కల్పించడానికి ఈ పరిశ్రమే తోడ్పడింది. ఈ కర్మాగారంలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి 49 శాతం ఉంటే డెల్టా సుగర్స్ అనే ప్రైవేటు కమెపెనీకి 51శాతం వాటా ఉంది.

1950 జూన్ చివరి నాటికి నిజాం చక్కెర కర్మాగారంలో మూడు లక్షల బస్తాల చక్కెర ఉత్పత్తి అయ్యేది. 1949-50 సంవత్సరాలలో ఈ కర్మాగారం రూ. 42 లక్షల లాభం సంపాదించింది.

ప్రైవేటీకరణే సర్వరోగ నివారిణి అన్న సిద్ధాంతాన్ని నమ్మే చంద్రబాబు నాయుడు 2002లో ఈ కర్మాగారాన్ని సంయుక్త పరిశ్రమ అన్న పేరుతో డెల్టా సుగర్స్ అనే ప్రైవేటు కంపెనీకి ధారాదత్తం చేశారు. ఒక పద్ధతి ప్రకారం ఈ ప్రభుత్వ రంగ పరిశ్రమను దివాలా తీయించి చివరకు ప్రైవేటు పరం చేశారు. ఆ ప్రైవేటు కంపెనీ చేసిన నిర్వాకం ఏమిటంటే రైతుల దగ్గర చెరకు తీసుకుని డబ్బు చెల్లించక పోవడం. ఈ పరిశ్రమను నడపడంలో ఆ ప్రైవేటు కంపెనీకి ఆసక్తి కూడాలేదు. రైతులకు ఆ కంపెనీ దాదాపు రూ. 60 కోట్లు బకాయి పడింది. ఈ కంపెనీని ప్రేవేటుకు తెగనమ్మే ప్రయత్నాలను రైతులు వ్యతిరేకించినా చంద్రబాబు హయాంలో ఫలితం లేకుండా పోయింది. 2001లోనే ఈ ఫాక్టరీ కింద ఉన్న భూములను వేలం వేసే కార్యక్రమం ప్రారంభించారు. దాదాపు 4200 ఎకరాల ఫాక్టరీ భూమిని వేలం వేసి తెగనమ్మేశారు. నిజాం సుగర్ ఫాక్టరీకి బోధన్, యెడ్పల్లి, కోట్గిర్, రెంజల్ మండలాల్లో సొంత భూములుండేవి. వాటినన్నింటినీ వేలానికి పెట్టారు.

కోర్టులోనూ దక్కని న్యాయం

ఆ సమయంలోనే సుగర్ మజ్దూర్ సభ నిజాం చక్కెర ఫాక్టరీని ప్రైవేటీకరించే ప్రయత్నాలను సవాలు చేసింది. అయితే అప్పడు హైకోర్టు న్యాయమూర్తి టి. సిహెచ్. సూర్యా రావు ప్రైవేటీకరణ ప్రభుత్వ విధాన నిర్ణయం అయినందువల్ల న్యాయస్థానం ఈ విషయంలో జోక్యం చేసుకోదని తేల్చి చెప్పడంతో ప్రైవేటీకరణ హాయిగా సాగి పోయింది. ప్రభుత్వ రంగం కన్నా ప్రైవేటు రంగం సమర్థంగా పని చేసి లాభాలు గడిస్తుందన్న ప్రచారం ఈ చక్కెర ఫాక్టరీ విషయంలో మాత్రం తుస్సుమంది.

వై ఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా నిజాం చక్కెర ఫాక్టరీ విషయాన్ని అధ్యయనం చేయడానికి శాసన సభా సంఘాన్ని నియమించారు. ఆ సంఘం ఈ కర్మాగారాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సిఫార్సు చేసింది. ఇంతలో రాజశేఖర రెడ్డి మరణించడంతో ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం సాధ్యం కాలేదు.

ఈ మధ్యలోనే మరో మతలబు కూడా లేకపోలేదు. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పూర్తిగా ప్రైవేటీకరించాలన్న ప్రయత్నమూ చేసింది. ప్రైవేటీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం 2013లో మంత్రుల బృందాన్ని కూడా నియమించింది. నిజానికి ప్రైవేటీకరించే ప్రయత్నం చేయడం శాసన సభా సంఘం చేసిన సిఫార్సుకు విరుద్ధమైంది. ప్రైవేటీకరణ ప్రక్రియను కొనసాగించకూడదని హైకోర్టు 2014 జనవరిలో ప్రభుత్వాన్ని అదేశించింది. రైతులు మాత్రం నిరంతరంగా ఈ పరిశ్రమను సహకార రంగంలో నడపాలని పోరాడుతూనే ఉన్నారు.

ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమం సాగుతున్న దశలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ తాము అధికారంలోకి వస్తే నిజాం చక్కెర ఫాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని చెప్పారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచార సందర్భంగా కూడా ఇదే మాటను పునరుద్ఘాటించారు. ఆ కర్మాగారానికి ఉన్న పూర్వ వైభవాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు. ఆ పరిశ్రమను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని రైతులకు రావాల్సిన బకాయిలను కూడా చెల్లిస్తామని ప్రకటించిన ముఖ్య మంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.

నిజాం చక్కెర ఫాక్టరీ తెలంగాణ ప్రజలకు సంబంధించినంత వరకు కేవలం ఓ పరిశ్రమ కాదు. అది ఈ ప్రాంత పారిశ్రామికీకరణకు జరిగిన తొలి ప్రయత్నాలకు సంకేతం. ఆ స్మృతిని కాపాడడానికి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని అభినందించాల్సిందే.

-ఆర్వీ రామారావ్

Next Story