Telugu Global
Others

మారిన మ‌నిషి జ‌గ‌న్... పార్టీ బ‌లోపేతానికి త‌హ‌త‌హ?

వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జ‌గ‌న్మోహ‌న‌రెడ్డి మారారా? త‌ను పోగొట్టుకున్న సీనియ‌ర్లంద‌రినీ మ‌ళ్ళీ త‌న అక్కున చేర్చుకోవాల‌నుకుంటున్నారా? త‌న మొండి వైఖ‌రిని, ఏక‌ప‌క్ష ధోర‌ణిని ఆయ‌న మార్చుకుని పార్టీని బ‌లోపేతం చేయాల‌నుకుంటున్నారా? ప‌రిస్థితులు… ప‌రిణామాలు అవున‌నే స‌మాధానం చెబుతున్నాయి. ఆయ‌న మారిన వైఖ‌రే పార్టీ నుంచి తీవ్ర ఆరోప‌ణ‌లు చేసి బ‌య‌ట‌కు వెళ్ళిపోయిన కోణ‌తాల రామ‌కృష్ణ‌ను మ‌ళ్ళీ ర‌ప్పించేట్టుగా క‌నిపిస్తోంది. కాంగ్ర‌స్‌లో బ‌ల‌మైన నాయ‌కుడు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ను వైసీపీలోకి చేర్చుకోవ‌డానికి దారులు వేస్తున్నాయి. ఉత్త‌రాంధ్ర‌కు చెందిన మ‌రో సీనియ‌ర్ […]

మారిన మ‌నిషి జ‌గ‌న్... పార్టీ బ‌లోపేతానికి త‌హ‌త‌హ?
X

cpvvsవైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జ‌గ‌న్మోహ‌న‌రెడ్డి మారారా? త‌ను పోగొట్టుకున్న సీనియ‌ర్లంద‌రినీ మ‌ళ్ళీ త‌న అక్కున చేర్చుకోవాల‌నుకుంటున్నారా? త‌న మొండి వైఖ‌రిని, ఏక‌ప‌క్ష ధోర‌ణిని ఆయ‌న మార్చుకుని పార్టీని బ‌లోపేతం చేయాల‌నుకుంటున్నారా? ప‌రిస్థితులు… ప‌రిణామాలు అవున‌నే స‌మాధానం చెబుతున్నాయి. ఆయ‌న మారిన వైఖ‌రే పార్టీ నుంచి తీవ్ర ఆరోప‌ణ‌లు చేసి బ‌య‌ట‌కు వెళ్ళిపోయిన కోణ‌తాల రామ‌కృష్ణ‌ను మ‌ళ్ళీ ర‌ప్పించేట్టుగా క‌నిపిస్తోంది. కాంగ్ర‌స్‌లో బ‌ల‌మైన నాయ‌కుడు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ను వైసీపీలోకి చేర్చుకోవ‌డానికి దారులు వేస్తున్నాయి. ఉత్త‌రాంధ్ర‌కు చెందిన మ‌రో సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు బొత్స స‌త్య‌నారాయ‌ణ కూడా వైఎస్ఆర్ పార్టీలోకి రానున్నార‌నే వార్త‌లు విన‌వ‌స్తున్నాయి. ఈ ఇద్దరు నేతలు వైసీపీలో చేరేందుకు రెడీగా ఉన్నార‌న్న‌ది ఇపుడు పొలిటికల్ స‌ర్కిల్స్‌లో జ‌రుగుతున్న చ‌ర్చ. పార్టీ బలోపేతానికి సీనియ‌ర్ స్టార్స్ అంద‌రినీ సిద్దం చేయాలని జగన్ భావిస్తున్నార‌న‌డానికి ఇవి సంకేతాలు మాత్ర‌మే. బొత్స రాక దాదాపు ఖ‌రార‌యిన‌ట్టేన‌ని తెలుస్తోంది. ఆయ‌న బ‌హుశా జూన్ 3న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్ధం తీసుకుంటార‌న్న సంకేతాలు వ‌స్తున్నాయి.

2014 ఎన్నికలకు ముందు… ఎన్నికలకు తర్వాత వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిన వారందరిదీ ఒకే మాట. పార్టీ అధినేత జగన్ వ్యవహరశైలిని భ‌రించ‌డం క‌ష్టం కాబ‌ట్టే తామంతా బ‌య‌ట‌కు వెళ్ళిపోయామ‌ని. పార్టీని ద‌గ్గ‌ర నుంచి చూసిన వారంద‌రూ ఈ మాట‌ల‌తో నూరు శాతం ఏకీభ‌విస్తారు. జ‌గ‌న్ ఎవరి మాట వినరని… ఆయ‌నంతా అదో టైప‌ని ఆయ‌న స‌న్నిహితులే అంత‌రంగిక సంభాష‌ణ‌ల్లో వెల్ల‌డించే అభిప్రాయం. తాను న‌మ్మిన న‌లుగురైదుగురే కోటరీ ముసుగులో రాజకీయాలు నడుపుతున్నారని వైసీపీని వీడిన నేతలంతా చెప్పే మాట‌లు. ఇవే కారణాలతో కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావు, జూపూడి ప్రభాకర్ రావు లాంటి నేతలు పార్టీని వీడారు. మరి ఇప్పుడు జగన్ మారార‌ని, పార్టీని వీడిన నాయకులకు మళ్లీ స్వాగతం పలకాలనుకుంటున్నార‌ని చెబుతున్నారు. కొణతాల రామకృష్ణతోపాటు కాంగ్రెస్‌ నేత బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ నాయకులకు వైసీపీ కండువా కప్పాలని మారిన జగన్ తహతహలాడుతున్నార‌ని ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికల్లో అధికారానికి దూరమైనా… బలమైన ప్రతిపక్షంగా వైసీపీ అవతరించింది. కానీ కొన్ని బ‌ల‌హీన‌త‌ల వ‌ల్ల‌ అధికార పార్టీని ఎదుర్కోలేకపోతోంది. ప్రతిపక్ష పాత్రను పోషించలేకపోతోందన్న విమర్శలను మూటగట్టుకుంటుంది. దీంతో పార్టీ బలోపేతంపై జగన్ దృష్టి పెట్టారంటున్నారు నేతలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి అలిగి వెళ్ళిపోయిన కొంత‌మంది, అధినేత వైఖ‌రి న‌చ్చ‌క వేరే పార్టీల్లోకి వెళ్ళిపోయిన మ‌రికొంత‌మంది, పార్టీలోనే ఉంటూ స్త‌బ్ధుగా ఉంటున్న ఇంకొంత‌మందిని కూడా తిరిగి పార్టీలోకి ర‌ప్పించ‌డానికి… లేదా క్రియాశీలం చేయ‌డానికి కూడా పార్టీ అధ్య‌క్షుడు జ‌గ‌న్ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్న‌ట్టు చెబుతున్నారు. కొత్త‌ప‌ల్లి గీత‌, బొడ్డు భాస్క‌ర రామారావు, ఆదినారాయ‌ణ రెడ్డి… ఇలాంటి నాయ‌కుల్ని పార్టీ పోగొట్టుకుంది. బ‌ల‌మైన పార్టీ ఇలా బ‌ల‌హీన ప‌డిపోతే రేప‌న్న రోజు త‌మ వెనుక ఎవ‌రూ ఉండ‌ర‌నే వాస్త‌వం తెలుసుకున్న జ‌గ‌న్ ఇప్ప‌టి నుంచే త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని యోచిస్తున్న‌ట్టు చెబుతున్నారు. పార్టీ ప‌రంగా ఎంత ప‌ని చేసినా… ఎన్ని కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించినా త‌గిన ఫ‌లితం ద‌క్క‌డం లేద‌ని… దీనికి కార‌ణం త‌న‌పైన‌, త‌న పార్టీపైన నెగిటివ్ ప్ర‌చారం ఎక్కువ‌గా జ‌ర‌గ‌డ‌మేన‌న్న వాస్త‌వాన్ని ఆయ‌న ప‌సిగట్టిన‌ట్టు తెలుస్తోంది. అందుకే ముందుగా తాను మారి త‌ర్వాత పార్టీని బ‌లోపేతం చేయాల‌న్న సంక‌ల్పానికి అనుగుణంగా ప్ర‌స్తుతం పావులు క‌దుపుతున్నారు.

రాయలసీమ జిల్లాల్లో ఒక్క అనంతపురం మినహాయిస్తే మిగతా మూడు జిల్లాల్లోనూ వైసీపీదే ఆధిక్యత. ఎన్నికలకు ముందు ఉత్తరాంధ్రలో పార్టీ అత్య‌ధిక స్థానాలు కైవ‌సం చేసుకుంటుంద‌ని అందరూ అనుకున్నారు. కానీ ఫలితాలు దిమ్మ తిరిగేలా చేశాయి. ఉత్తరాంధ్రలో 34 అసెంబ్లీ స్థానాలున్నాయి. సర్వేల్లో ఇక్కడ వైసీపీదే హవా అనే ప్రచారం బాగా జరిగింది. కానీ ఎన్నికల నాటికి సీన్ తారుమారైంది. 34 స్థానాలకు కేవలం తొమ్మిదింటిని మాత్రమే వైసిపీ గెలుచుకోగ‌లిగింది. విశాఖ జిల్లాలో 15 స్థానాలకు 3 మాత్రమే వైసీపీకి దక్కాయి. కేవ‌లం జ‌గ‌న్ వ్య‌వ‌హార‌శైలే దీనికి కార‌ణ‌మ‌ని అప్ప‌ట్లో తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర‌య్యాయి. ఉత్త‌రాంధ్ర‌ను బ‌లోపేతం చేయ‌డానికి బొత్స వంటి సీనియ‌ర్ నాయ‌కుల అవ‌స‌రాన్ని జ‌గ‌న్ గుర్తించార‌ని అంటున్నారు. నిజానికి బొత్స‌కు కూడా కాంగ్రెస్ శిధిల‌మైన త‌ర్వాత స‌రైన పార్టీ వేదిక దొర‌క‌లేదు. తెలుగుదేశం పార్టీ వైపు వెళ్ళ‌లేని బొత్స కొంత‌కాలం బీజేపీ వైపు చూశారు. అక్క‌డి నుంచి సానుకూల సంకేతాలు రాక పోవ‌డంతో వైసీపీ వైపు దృష్టి సారించారు. వైఎస్ఆర్సీ కూడా బొత్స వైపు చూస్తోంది. త‌న‌తో చేయి క‌ల‌ప‌డానికి సిద్దమయ్యే పెద్ద నేతలపై దృష్టి పెట్టి పార్టీని బ‌లోపేతం చేసుకోవాల‌న్న‌ది జ‌గ‌న్ ఆకాంక్ష. ఈ కార‌ణంగానే కొణతాల లాంటి నేతలను తిరిగి రప్పించడానికి జగన్ ప్రయత్నిస్తున్నారనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న కొణతాల రామకృష్ణ ఎంపీగా, వైఎస్ హయాంలో మంత్రిగా పని చేశారు. వైఎస్ కోటరీలో ముఖ్య నేతగా ఆయనకు ఓ గుర్తింపు ఉండేది. జగన్ కాంగ్రెస్‌ను వీడిన సందర్బంలో కొణతాల జగన్ వెంటే నడిచారు.. వైసీపీ బలోపేతం, కీలక నిర్ణయాల్లో ఆయన పాత్ర మ‌రిచిపోయేదేమీ కాదు. కానీ రాజ్యసభ సభ్యత్వం విషయంలో జగన్‌కు ఆయనకు మధ్య గ్యాప్ రావడం, కొణతాలను కాదని పార్టీలోకి అతని చిరకాల ప్రత్యర్థి దాడి వీరభద్రరావును చేర్చుకోవడం, జిల్లా రాజకీయాల్లో ఆయన మాట చెల్లకుండా నిర్ణయాలు తీసుకోవడంతో గత అక్టోబర్‌లో కొణతాల పార్టీని విడిచిపెట్టి పోయారు. ఆ స‌మ‌యంలో అధినేతపై ఘాటైన పదజాలంతో లేఖ రాసి.. జగన్ తీరును ఎండగట్టారు. అయినా ఆయ‌న్ని చేర్చుకుని మున‌ప‌టి ప్రాధాన్యం ఇవ్వాల‌ని జ‌గ‌న్ భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. దీనివ‌ల్ల విశాఖ‌లో పార్టీకి పెద్ద దిక్కు ఏర్ప‌డ‌డ‌మే కాక రాష్ట్ర రాజ‌కీయాల్లో గుర్తింపు ఉన్న నేత‌గా కూడా అవుతార‌ని జ‌గ‌న్ అనుకుంటున్నారు. ఇప్ప‌టికే దాడి వీరభద్రరావు వైసీపీకి దూరంగా ఉంటున్నారు. సబ్బంహరి కాంగ్రెస్‌లో ఉంటూనే జగన్‌కు చాలా అనుకూలంగా వ్యవహరించేవారు. కానీ జగన్ వ్య‌వ‌హ‌రించిన తీరును ప్రశ్నిస్తూ ఈ ఇద్దరు నాయకులు పార్టీని వీడారు… దీంతో విశాఖలో పార్టీ పునర్ వైభవం రావాలంటే కొణతాల అవసరం ఉందని జగన్ భావిస్తున్నారని తెలిసింది.

మరోవైపు వైసీపీలో చేరతారన్న ప్రచారాన్ని బొత్స స్వయంగా ఒక ద‌శ‌లో ఖండించారు. తనకు పార్టీలో చేరాలని లేకపోయినా చేర్చుకుంటే ఎలా ఉంటుందనే చర్చ వైసీపీలో జరిగుండొచ్చంటున్నారు బొత్స. ఎమ్మెల్సీ పదవిచ్చి మండలిలో పార్టీ ఫ్లోర్ లీడర్‌గా ఎంపిక చేస్తే బొత్స రావొచ్చనే ప్రచారం జరిగింది.. నిజానికి రేపు వేరే పార్టీలో చేరేవారు కూడా ఈరోజు తాము ఫ‌లానా పార్టీలో చేరుతున్నామ‌ని చెప్పే సంద‌ర్భాలు పెద్ద‌గా ఉండ‌వ‌నే చెప్పాలి. అందులోకి లోతు గుండె క‌లిగిన బొత్స అంత త్వ‌ర‌గా బ‌య‌ట ప‌డ‌తారంటే ఎవ‌రూ న‌మ్మ‌రు. నిజానికి ఆయ‌న ఇప్ప‌టికే ఒక‌టిరెండు సార్లు జ‌గ‌న్‌ను క‌లిసి వెళ్ళిన మాట వాస్త‌వ‌మ‌న్న‌ది రాజ‌కీయాల్లో ఉండే చాలామందికి తెలుసు. బొత్సను చేర్చుకుంటే విజయనగరం జిల్లాలో పార్టీ మరింత బలోపేతమవుతామన్న ఆలోచనకు జగన్ వచ్చారని చెబుతున్నారు. బొత్స సామాజిక వర్గం ఉత్తరాంధ్రలో బలంగా ఉండటం పార్టీకి ప్లస్ అవుతుందని జగన్ భావిస్తున్నారని తెలుస్తోంది. బొత్సను పార్టీలో చేర్చుకునే అంశంలో మాజీ మంత్రి ధర్మాన, వైసీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్, ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావుల అభిప్రాయాన్ని జ‌గ‌న్ తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశార‌ని చెబుతున్నారు. బొత్స వ‌స్తే ఉత్త‌రాంధ్ర‌లో త‌మకు బ‌లం ఉండ‌ద‌ని, పైగా బొత్స తిమింగలం వంటి వార‌ని, ఆయ‌న ద‌గ్గ‌ర త‌మ వంటి వారు మ‌నుగ‌డ సాగించ‌డం సాధ్యం కాద‌న్న భావంతో వీరు ఆయ‌న రాక‌ను వ్యతిరేకించిన‌ట్టు చెబుతున్నారు.

బొత్స‌ను చేర్చుకునే విష‌యంలో ప్ర‌స్తుతం విజ‌య‌న‌గ‌రం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామిని కూడా జ‌గ‌న్ అడిగారు. ఆయ‌న కూడా తేల్చి చెప్ప‌క‌పోయిన‌ప్ప‌టికీ అధిష్టానం మాటే త‌న‌కు శిరోధార్య‌మ‌ని సంకేతాలిచ్చారు. బొత్స వ‌ల్ల త‌మ‌కు ఇబ్బందులు వ‌స్తాయ‌ని చెప్పిన వీరిని సంతృప్తి ప‌రిచేందుకు జ‌గ‌న్ చాలా ప్ర‌య‌త్నం చేశార‌ని చెబుతున్నారు. ఒక‌వేళ అలాంటి ప‌రిస్థితి వ‌స్తే అంతిమ నిర్ణ‌యం త‌న‌దే క‌దా… కాంగ్రెస్ మాదిరిగా మీకు మ‌రో అధిష్టానం లేదు క‌దా అని స‌ముదాయించిన‌ట్టు వినికిడి. గత అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా పార్టీలోకి వ‌స్తామ‌న్న వారిని తీసుకోక‌పోవ‌డం వ‌ల్లే రెండుమూడు శాతం ఓట్లు పోగొట్టుకున్నామ‌ని, ఆరోజు అలా జ‌ర‌గ‌కుండా ఉంటే ఈరోజు అధికారం ద‌క్కి ఉండేద‌ని జ‌గ‌న్ ఈ సంద‌ర్భంగా వారితో అన్న‌ట్లు తెలిసింది. ఈనేప‌థ్యంలో బొత్స‌ను చేర్చుకునే విష‌యంలో దాదాపు లైన్ క్లియ‌ర్ అయిన‌ట్టే. బొత్స వస్తే తమకు రాజకీయంగా కష్టమనే భావనతో ఆయ‌నకు బ‌దులు కొణతాలే మంచి ఆప్ష‌న్ అని వీరిద్ద‌రూ ఆయ‌న‌ పేరును తెరపైకి తెచ్చారని వైసీపీలో ప్రచారం జరుగుతోంది. దీంతో కొణతాలకు కూడా ఈ విధంగా వైసీపీలోకి రావ‌డానికి లైన్ క్లియ‌ర్ అయ్యింద‌ని చెబుతున్నారు. దీంతో పాత గొడవలు పక్కన పెట్టి కొణతాలకు మ‌రోసారి వైసీపీ తీర్థం ఇచ్చేందుకు జగన్ సిద్దమయ్యారంటున్నారు నేతలు. బొత్స‌ను లోపాయికారిగా న‌లుగురైదుగురు వైసీపీ నేత‌లు పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించారు కూడా. అందుచేత ఆయ‌న రాక కూడా దాదాపు ఖ‌రార‌యిన‌ట్టేన‌ని తెలుస్తోంది. నిజంగా జ‌గ‌న్ మారితే పాత‌వారిని మ‌ళ్ళీ పిలిచి పార్టీని బ‌లోపేతం చేసుకుంటే అధికార ప‌క్షానికి ఎండాకాలం వెళ్ళిన త‌ర్వాత కూడా చెమ‌ట‌లు ప‌ట్టించ‌డం ఖాయం! -పీఆర్ చెన్ను

Next Story