Telugu Global
Others

విదేశీ రాజధాని

కాల్పనిక జగత్తులో విహరించే కవులు, రచయితలు, కాళాకారులు కలలు కనక తప్పదు. రచయితలు కలలు కనాల్సిందేనన్నాడు గోర్కీ. విచిత్రం ఏమిటంటే వాస్తవ జగత్తులో ఉండాల్సిన రాజకీయ నాయకులు సైతం అద్భుతమైన కలలు కంటారు. కలలు కనడమే కాదు జనమంతా కలలు కనేట్టు బలవంత పెడతారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మేలు జాతి కలల బేహారి. ఆయన ప్రస్తుతం నూతన రాజధానికి సంబంధించిన కలలను అమ్మే పనిలో ఉన్నారు. ఆ కలలు కూడా నాసిరకం స్వదేశీ […]

విదేశీ రాజధాని
X

RV Ramaraoకాల్పనిక జగత్తులో విహరించే కవులు, రచయితలు, కాళాకారులు కలలు కనక తప్పదు. రచయితలు కలలు కనాల్సిందేనన్నాడు గోర్కీ. విచిత్రం ఏమిటంటే వాస్తవ జగత్తులో ఉండాల్సిన రాజకీయ నాయకులు సైతం అద్భుతమైన కలలు కంటారు. కలలు కనడమే కాదు జనమంతా కలలు కనేట్టు బలవంత పెడతారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మేలు జాతి కలల బేహారి. ఆయన ప్రస్తుతం నూతన రాజధానికి సంబంధించిన కలలను అమ్మే పనిలో ఉన్నారు. ఆ కలలు కూడా నాసిరకం స్వదేశీ కలలు కాదు. స్వదేశీ అన్న మాట గాంధీ సిద్ధాంతంతో పాటే సమాధి అయిపోయింది. ఇప్పుడంతా విదేశీయమే.

చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్లు అవిచ్ఛిన్నంగా అధికారంలో ఉన్నప్పుడు “విజన్ 2020” అన్న కలలు అమ్మారు. ఆయన పదేళ్లపాటు అధికారానికి దూరంగా ఉండకపోతే ఆ కలల పస ఏమిటో తెలిసేది. కాని అంత అదృష్టం లేదు. దాదాపు ఏడాది కింద ఆయనను ముఖ్యమంత్రి పదవి మళ్లీ వరించింది. కాంగ్రెస్ కు ఆయన రుణపడి ఉండాల్సిందే. అయితే ఆయన 13 జిల్లాలతో కూడిన అవశిష్ట రాష్ట్రానికే ముఖ్యమంత్రి. ఆ రాష్ట్రానికి రాజధాని లేదు. ఆంధ్రులు రాజధానికోసం వెదుకులాడడం ఇది కొత్త కాదు. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఉన్నప్పుడు మద్రాస్ రాజధాని అనుకున్నారు. ఆంధ్ర రాష్ట్రం అవతరించినప్పుడు కర్నూలు రాజధాని అయింది. ఆ మురిపెం మూడేళ్లయినా దక్కలేదు. ఆంధ్ర ప్రదేశ్ అవతరించగానే సిద్ధాన్నంలా హైదరాబద్ ఆంధ్రులకు రాజధాని నగరమైంది. ఆరు పదులు దాటకుండానే మళ్లీ తెలుగు వారు రెండు ముక్కలుగా విడిపోయారు. మళ్లీ ఆంధ్రులకు కొత్త రాజధాని వేట తప్పలేదు. రాష్ట్రాన్ని విడదీసిన కేంద్ర ప్రభుత్వం ఉడతా భక్తిగా కొత్త రాజధాని ఎక్కడ ఏర్పరిస్తే బాగుంటుందో పరిశీలించడానికి శివ రామ కృష్ణన్ నాయకత్వంలో ఓ కమిటీని నియమించింది. ఆ కమిటీ అనేక ప్రాంతాలలో కాళ్లరిగేట్టు తిరిగి తనకు తోచిన సూచనలు చేసింది. ఈ లోగా ఎన్నికలు జరిగి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిపోయారు. అసలే ప్రభుత్వాలు తాము ఏర్పాటు చేసిన కమిషన్ల, కమిటీల నివేదికలను పట్టించుకోవు. కలల లోకంలో విహరించే చంద్రబాబు పట్టించుకుంటారా. ఈ సర్వేలు, అధ్యయనాల బాదర బందీ లేకుండా ఆయన శివరామ కృష్ణన్ కమిటీ నివేదిక గ్రంథం అట్టయినా విప్పకుండానే గుంటూరు విజయవాడ మధ్య కొత్త రాజధాని నిర్మిస్తామని ప్రకటించేశారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా!

ప్రకాశం జిల్లా దొనకొండ దగ్గర 50,000 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది కనక అక్కడ రాజధాని ఏర్పాటు చేయడం మేలని కొందరు అమాయక చక్రవర్తులు సూచించారు. మరి కొంత మంది హైదరాబాద్ ఆంధ్ర ప్రదేశ్ కు రాజధాని అయిన తర్వాత అభివృద్ధి చక్రం భూమి సూర్యుని చుట్టూ తిరిగినట్టు హైదరాబాద్ చుట్టే తిరిగింది కనక మళ్లీ అలాంటి ఇబ్బంది రాకుండా రాజధానిని వికేంద్రీకరించి ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని జిల్లాలు అభివృద్ధి చెందడానికి వీలుగా వివిధ జిల్లాల్లో విభిన్న ప్రభుత్వ కార్యాలయాలు, పరిశ్రమలు, గట్రా ఏర్పాటు చేయాలని సూచించిన అమాయకులూ ఉన్నారు. ఈ అమాయకులందరికీ ఉన్న అమాయకత్వం ఏమిటంటే చంద్రబాబు అమాయకుడు కాడని తెలియకపోవడమే. ఏ బాదర బందీ లేకుండా రాజధాని ఎక్కడ ఏర్పడుతుందో చంద్రబాబు శిలా శాసనం వేసినట్టు చెప్పేశారు.

రాజధాని ఎక్కడ ఉండాలో సూచించిన నిపుణులు, ఇతర ఔత్సాహికులు పండితులే కావచ్చు. కాని ససేమిరా వారికి రాజకీయాలు తెలియవు. అవి బాగా తెలిసిన చంద్రబాబు తనను మళ్లీ అధికారంలో ప్రతిష్టించిన వర్గాల వారి రుణం తీర్చుకోవడానికి రాజధాని గుంటూరు విజయవాడ మధ్య ఉంటుందని తేల్చేశారు. దానికి అమరావతి అన్న పేరు పెట్టమని సూచించగలిగిన పెద్దలు ఉండనే ఉన్నారు. కొత్త రాజధానికి ఎంత ఖర్చవుతుంది ఎన్నేళ్లు పడుతుంది అన్న విషయంలో ఎవరి లెక్కలు వారికున్నాయి. కొందరు లక్ష కోట్లంటే ఇంకొందరు రెండు లక్షల కోట్లంటున్నారు. కలలు కనడంలో, భారీ ప్రణాళికలు రూపొందించడంలో దిట్ట అయిన చంద్ర బాబు అంచనా మాత్రం నాలుగున్నర లక్షల కోట్లు. అసలే లోటు బడ్జెట్ తో తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ఇంత ఖర్చు ఎలా భరిస్తుందని అడిగే అమాయక చక్రవర్తులు ఎప్పుడూ ఉంటారు. అమాయకత్వానికి అంతా పొంతా! చంద్రబాబు పట్టు విడవని విక్రమార్కుడు. ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక ప్రతిపత్తి ఇస్తామని కేంద్రం మొండి చెయ్యి చూపినా నిరాశపడలేదు. ఇవ్వబోమని చెప్పలేదుగా అంతవరకు ప్రయత్నిస్తూనే ఉంటామని భరోసా ఇచ్చారు. కలలు కనడమే కాదు ఆ కలల మీద భరోసా ఉండాలి! రాజధాని నిర్మాణానికి అయ్యే ఖర్చు అంతా కేంద్రమే సమకూరుస్తుందన్న అపోహ చంద్రబాబుకు ఏ మాత్రం లేదు. అందుకని తన ఏర్పాట్లను తాను చేసుకుంటున్నారు. ఆయనకు అండగా ఉండే మోతుబరులకు కొదవ లేదు. చంద్రబాబు బతుకు బతకనివ్వు అన్న కిటుకు వై ఎస్ రాజశేఖర రెడ్డి నుంచి ఒంటబట్టించుకున్నట్టున్నారు.

రైతులకు అర చేతిలో స్వర్గం చూపిస్తున్నారు. ఇప్పటికే 30,000 ఎకరాల భూమి సేకరించేశారట. కావాలంటే మరింత సేకరిస్తారు. భూ సేకరణకు అడ్డు తగిలే “అభివృద్ధి నిరోధక శక్తులు” ఏవైనా ఉంటే ఆదుకోవడానికి మోదీ తెస్తున్న భూ సేకరణ చట్టం ఉండనే ఉంటుంది. మొత్తం మీద శాతవాహనులకు రాజధానిగా ఉన్న ధాన్య కటకకానికి (అమరావతి) రెండు వేల ఏళ్ల తర్వాత మహర్దశ పట్టబోతోంది. అయితే ఈ మహర్దశ పేరుకు మాత్రమే పరిమితం. కొత్త రాజధాని స్వదేశీ సరుకు కాదు. అంతా విదేశీయమే. మన రాష్ట్రం రాజధాని నిర్మాణానికి కావాల్సిన పథక రచన చేసే వారికి గొడ్డుబోయింది కాబట్టి మార్చిలో చంద్రబాబు సింగపూర్ వెళ్లి అక్కడి వాళ్లను కొత్త రాజధానికి ప్రణాళికలు రూపొందించమని పురమాయించారు. వారు ఆఘ మేఘాల మీద కొత్త రాజధాని నమూనా గీసేశారు. దానికి చంద్రబాబు కొన్ని సవరణలు సూచించారు. ఆ సవరణలతో సహా మరో నెల, నెల పదిహేను రోజుల్లో కొత్త ప్రణాళిక సిద్ధమవుతుంది. ఈ మేరకు 2014 డిసెంబర్ లోనే సింగపూర్ తో అవగాహ‌న కుదుర్చుకున్నారు. రేపో మాపో చంద్రబాబు కొత్త రాజధానికి శంకుస్థాపన చేసేసి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడానికి సకల ఏర్పాట్లూ చేసేసుకున్నారు.

కొత్త రాజధాని “ప్రపంచంలోనే ఉత్తమ నగరం”గా ఉంటుందని చంద్రబాబు హామీ ఇస్తున్నారు. “ఉత్తమ” అన్న ఆయన మాటకు ఎవరికి తోచిన నిర్వచనం వారు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ విభాగం ఈ ఏడాది ఆరంభంలో “జీవించచడానికి అత్యుత్తమ నగరం టోరంటో” అని తేల్చింది. అక్కడితో ఊరుకోకుండా ప్రపంచంలో “సురక్షితమైన నగరం” టోక్యో అని చెప్పింది. అత్యంత నివాసయోగ్యమైన నగరం మెల్బోర్నట. నాణ్యమైన జీవనానికి ఉత్తమ నగరం వియన్నా అట. మరి ఈ కొలమానాల ప్రకారం అమరావతి ఏ రీతిలో ఉత్తమంగా ఉంటుందో?ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో అంతర్జాతీయ విమానాశ్రయం ఉందన్న సంతృప్తి ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ కు ఆ స్థాయి విమానాశ్రయం లేదు. అందుకని చంద్రబాబు మంగళగిరిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేస్తామంటున్నారు. కృష్ణా జిల్లా గన్నవరంలో ఇదివరకే ఓ విమానాశ్రయం ఉంది. మంగళగిరికి, గన్నవరానికి మధ్య దూరం 40 కిలోమీటర్లే. అంత తక్కువ దూరంలో రెండు విమానాశ్రయాలు సాధ్యమా అన్న కుశంకలు లేవనెత్తే డౌటుల్రావులకు కొదవ ఉండదు. అంత మాత్రం చేత చంద్రబాబును కలలు కనకూడదనలేం గదా!

2018కల్లా కొత్త రాజధాని మొదటి దశ పూర్తవుతుందని అంచనా. రాజధాని అవసరం కొద్దీ అభివృద్ధి చెందాల్సింది. అది విలాస కేంద్రం కాదు. కాకూడదు. రాజధాని అభివృద్ధికి చోదకశక్తిగా ఉండాలి. పంజాబ్ హర్యానా విడిపోయినప్పుడు చండీగఢ్ నగరాన్ని అద్భుతమైన, అపురూపమైన రీతిలో నిర్మించారు. అప్పుడు నెహ్రూ లాంటి వారికి సింగపూర్ ప్రతిభ తెలియదు. తెలిసినా అంగీకరించేటంతటి ఔదార్యం ఆ నాటి వారికి లేదు. చండీగఢ్ ఇప్పుడు సంపన్నుల నగరం. సింగపూర్ తో కొత్త రాజధాని నిర్మాణానికి ఒప్పందం చేసుకోవడం ద్వారా చంద్రబాబు “ప్రపంచంలోకెల్లా అత్యుత్తమ నగరానికి” బీజావాపన చేశారు. చంద్రబాబు ఏలుబడిలో విదేశీ రాజధానికూడా సంపన్నులకు ఆలవాలగా ఉంటుందేమో. సాదా సీదా బడుగు జనం గురించి ఆలోచించే వారికి విదేశీ తత్వం ఎన్నటికి ఒంటబట్టేను. జై సింగపూర్, జై జై సింగపూర్!

–ఆర్వీ రామా రావ్

Next Story