Telugu Global
Others

భూసేకరణ పై మేధాపాట్కర్

మేధా పాట్కర్ బృందం ఈ నెల 9న ఆంద్ర కొత్త రాజధాని ప్రాంతంలో పర్యటనకు వచ్చినపుడు, పెనుమాకలో జరిగిన బహిరంగ సభలో ఆమె ఇచ్చిన ఆంగ్ల ఉపన్యాసానికి యధాతధ అనువాదం. అనువాదం: రమాసుందరి గారు .  “వేదిక మీద ఉన్న సుప్రసిద్ధులైన క్రియాశీల కార్యకర్తలకూ, ఇక్కడకు విచ్చేసిన రాజకీయ పార్టీల ప్రతినిధులకూ, అధ్యక్ష మహోదయులు జస్టిస్ రెడ్డి సాబ్ అండ్ ది సాయంజీ, మిగతా అందరికి వందనాలు. ఇప్పటికే చాలా కాలాతీతమైనదని నాకు తెలుసు. నేను మీ […]

భూసేకరణ పై  మేధాపాట్కర్
X

మేధా పాట్కర్ బృందం ఈ నెల 9న ఆంద్ర కొత్త రాజధాని ప్రాంతంలో పర్యటనకు వచ్చినపుడు, పెనుమాకలో జరిగిన బహిరంగ సభలో ఆమె ఇచ్చిన ఆంగ్ల ఉపన్యాసానికి యధాతధ అనువాదం.

అనువాదం: రమాసుందరి గారు .

“వేదిక మీద ఉన్న సుప్రసిద్ధులైన క్రియాశీల కార్యకర్తలకూ, ఇక్కడకు విచ్చేసిన రాజకీయ పార్టీల ప్రతినిధులకూ, అధ్యక్ష మహోదయులు జస్టిస్ రెడ్డి సాబ్ అండ్ ది సాయంజీ, మిగతా అందరికి వందనాలు. ఇప్పటికే చాలా కాలాతీతమైనదని నాకు తెలుసు. నేను మీ హృదయ భాష తెలుగులో మాటాడలేను. నా మనసుకు దగ్గరైన మరాటీలో కూడా మాట్లాడలేను. హిందీ లేదా ఆంగ్లంలో మాత్రమే మాట్లాడగలను. ఈ విషయంలో మీరు నన్ను క్షమించాలి. ఇక్కడ డయాస్ మీద ఉన్న చాలా మంది కార్యకర్తలకు మాట్లాడే అవకాశం రాలేదు. ఈ విషయంలో నేను చాలా సిగ్గు పడుతున్నాను. రాజకీయ పార్టీలు ఈ వేదికను ఆక్రమించుకొని మీకు ఉపన్యాసాలు ఇచ్చాయి. కూడంకుళం నుండి వచ్చిన కార్యకర్తలూ, తమిళనాడులో మద్యనిషేధ ఉద్యమం చేసి వచ్చినవారూ, రైతుకూలీల కోసం ఇక్కడ పనిచేస్తున్న అఖిల భారత రైతు కూలీ సంఘం వారూ, వందల కొద్దీ మహిళలను సమీకరించిన పీవోడబ్ల్యూ వాళ్ళూ.. వీరందరికీ ఒక్క మాట కూడా మాట్లాడే అవకాశం రాలేదు. అయితే ఇప్పుడు ఈ ప్రజా ఉద్యమాలలో సింహాలనదగవారు, రాజకీయ నాయకులు ఒక అవగాహనకు రావలసిన పరిస్ధితికి నెట్టబడ్డారు. మధ్యప్రదేశ్ లో బలమైన రైతు సంస్థ భారతీయ కిసాన్ యూనియన్ నుండి వచ్చిన శరత్ చంద్ర త్రిపాఠి కూడా ఇక్కడ ఉన్నారు.

ప్రియమైన సోదర సోదరీమణులారా! నిజానికి మీరిక్కడ ఉన్నందుకే మీకందరికీ సెల్యూట్ చేస్తున్నాను. ఈ సెల్యూట్ మీరు ఇక్కడ చూపిస్తున్న బలానికి మాత్రమే కాదు. ఇప్పటికీ మీ భూములను, మీ మొత్తం జీవనోపాధిని కోల్పోకుండా అంటిపెట్టుకుని ఉన్నందుకు మమ్మల్ని ఇక్కడికి రప్పించింది. మీరు భూమి లేని దళితులు కావచ్చు, ఉదారవాద మహిళలు స్త్రీలు కావచ్చు, అసైన్డ్ భూముల్లో ఉన్న ఆదివాసులు కావచ్చు, లంకభూముల్లో ఉన్న దళిత క్రిష్టియన్లు కావచ్చు, పట్టాలు కలిగిన భూములు ఉన్నపక్కా రైతులు కావచ్చు.. దళితవాడల్లో, చిన్న గ్రామాల్లో, పెద్ద పెద్ద ఇల్లు ఉన్న బడా గ్రామాల్లో మేము కలిసిన ప్రజలు అందరూ…. ఈ రోజు బలవంతుడైన చంద్రబాబు నాయుడి టిడిపి ప్రభుత్వం నుండి సవాలు ఎదుర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ ప్రజలు అతనికి ఓటు వేసిన తరువాత ఆయన నుండి ఈ సవాలు ఎదుర్కొంటున్నారు. టిడిపి ప్రణాళిక నేను చదవలేదు కానీ అందులో దీనికి సంబంధించి ఒక్క విషయం కూడా ఉండి ఉండదు. అతను ఎన్నికల ప్రచారంలో చేసిన దొంగ హామీలకు మనందరం సాక్ష్యులమే. ఆ వాగ్ధానాలే ఇక్కడ ప్రజల వోట్ బ్యాంకును స్వాధీనం చేసుకొన్నాయి. అధికారం అప్పగించిన అనంతరం బడా కార్పొరేట్, పెట్టుబడిదారుల కోసం ముందుకు వచ్చిన వారి మాయోపాయాలు, మారు రూపాలు, విధానాలు, చట్టాలు విసిరిన సవాళ్లను ఎదుర్కోవలసిన పరిస్ధితికి జనం నెట్టివేయబడ్డారు. కనుక ఇది కేవలం ఆంధ్ర ప్రదేశ్ కేపిటల్ (రాజధాని) మాత్రమే కాదు; ప్రజాస్వామిక ప్రక్రియలను, ప్రజాస్వామిక నిర్మాణాలను మనీ కేపిటల్ (డబ్బు పెట్టుబడి) స్వాధీనం చేసుకోవడానికి సంబంధించిన ప్రాజెక్టు ఇది.

భూసేకరణ అనేది ఇప్పుడు దేశమంతా అన్ని రాజకీయ, సామాజిక వేదికలపై ప్రధాన అంశాల్లో ఒకటిగా అయిన సంగతి మీకందరికి ఇప్పటికే తెలుసు. భారతీయ రైతుల నుండి భూములనూ, భూమి లేని వారి నుండి ఇళ్ళనూ బ్రిటిష్ వాడు బలవంతంగా లాక్కోవడం మొదలుపెట్టినపుడు మన ప్రజల ఉద్యమాలే వారిని పదే పదే సవాలు చేశాయి. బ్రిటిష్ వాడి భూసేకరణ చట్టాన్ని రద్దు చేయించడానికి ప్రజలు ఒకదాని తర్వాత మరొకటి ఆందోళనలు నిర్వహిస్తూ వచ్చారు. పదులు, వందల సంఖ్యలో సంఘాలు నాలుగు లోక్ సభల ముందు ఆందోళనలు నిర్వహించాయి. అనంతరం పార్లమెంటరీ కమిటీ ముందు మన వాదనలు ప్రవేశపెట్టినపుడు కార్పొరేట్ లాబీలైన సి.ఐ.ఐ, ఫిక్కీ లాంటి అనేకులు బ్రిటిష్ చట్టాన్ని వెనకేసుకొచ్చాయి. అయితే అంతిమంగా మనం యుద్ధంలో విజయవంతం కావడంతో యు.పి.ఏ ప్రభుత్వం 2013 చట్టాన్ని తేవలసి వచ్చింది. కానీ ఆ చట్టం కూడా సంపూర్ణంగా సమర్ధవంతమైనదేమీ కాదు. కానీ రైతులు, గ్రామ సభలు భాగస్వామ్యం వహించడానికి ఆ చట్టంలో కనీస అవకాశాలు ఉన్నాయి. అభివృద్ధి ప్రణాళికలు అప్రజాస్వామికం కాకుండా ప్రజాస్వామికంగా ఉండాలంటే రైతులు, గ్రామ సభల పాత్ర తప్పనిసరి అవసరం.

అది కనీసం భూమికి సంబంధించిన విషయాలలో రైతులతో బాటు, భూమిలేని రైతుకూలీల ఉనికిని, పాత్రను కూడా గుర్తించింది. బహుళ పంటలు పండే భూమిని అవసరమైతేనే స్వాధీనం చేసుకోవాలని చట్టం చెప్పింది కానీ ఆ సంగతి ఉదాహరణకి అలాంటి భూమిలో ఎంత శాతం స్వాధీనం చేసుకోవచ్చన్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాల విచక్షణకు వదిలివేయబడింది. భూమిని స్వాధీనం చేసుకున్నఐదు సంవత్సరాల తర్వాత కూడా భూమిని ప్రభుత్వం ఉపయోగించకపోతే అది తిరిగి రైతుల చేతికి వెళ్లాలని చట్టం పేర్కొంది. భూములకు నష్ట పరిహారం ప్రకటించిన అయిదేళ్ళ వరకూ కూడా అవి తమ సొంతదారులైన రైతుల చేతుల్లోనే కొనసాగినట్లయితే అలాంటి భూములపై హక్కు రైతులకే చెందుతుందని చట్టం పేర్కొంది. ఈ చివరి అంశం ఇప్పటికీ చట్టంలో ఉన్నది. జనవరి 1, 2014 తేదీ నుండి అది అమలులోకి వస్తుందని చట్టం చెబుతోంది. ఈ అంశంపై సుప్రీం కోర్టు పదికి తక్కువ కాని తీర్పులు ఇచ్చింది. నర్మదాలోయలోనూ, ఢిల్లీ చుట్ట పక్కల నివశిస్తున్న వేలాది కుటుంబాలు ఈ అవకాశం ద్వారా తమ భూములపై హక్కును మళ్ళీ ప్రకటించుకోగలిగారు.

ఈ చివరి అంశం తప్ప మిగిలిన అంశాల నేపధ్యంలో చట్టంలో మార్పులు చేయాలన్న ఆలోచనకు ప్రభుత్వం వచ్చింది. ఎందువలన? చంద్రబాబు నాయుడు తీసుకొని రావాలని భావిస్తున్న ప్రాజెక్టులే ప్రభుత్వ ఆలోచనకు ప్రధాన కారణాల్లో ఒకటి. అవి ఎలాంటివంటే మీ జీవితాలనూ, మీ జీవోనోపాధిని కబళించాలనుకొంటున్నవి. అవి ఇండస్ట్రియల్ కారిడార్ల రూపంలోనైతేనేమి, రాజధాని పరివాహిక అభివృద్ధి పేరుతో నైతేనేమీ. అందుకే 2013 భూసేకరణ చట్టాన్ని మళ్ళీ మార్చబోతున్నారు. మొదటి ఆర్డినెన్స్ ను మనమందరం ఎదిరించిన తరువాత, రెండో ఆర్డినెన్స్ కొత్త సీసాలో పాత సారాయిలాగా వచ్చింది. కేంద్రప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ఈ రైతు, రైతుకూలి, జాలరుల వ్యతిరేక విధానాలను ఎదుర్కోవాల్సి వుంటుంది.

మీకు తెలిసే ఉంటుంది. ఈ రాజధాని పరివాహక అభివృద్ధి చట్టం, మోడి ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చే ముందు రోజు వచ్చింది. దేశమంతా రైతులు రైతు కూలీలు కేకలు పెడుతూ, అరుస్తూ, సవాళ్ళు విసురుతూ, ఈ బలవంతపు భూసేకరణ సవాలు స్వీకరిస్తూ ఉన్నారు ఇప్పుడు. ఇక్కడ రైతులంటే ఎవరి చేతులైతే భూమిలో ఉంటాయో, అంటే రైతు కూలీలు కూడా అని నా అర్ధం. బ్రిటిష్ చట్టం కంటే దుర్మార్గమైనది అయిన ఈ కొత్త చట్టం పూర్తిగా రైతుజాతిని సవాలు చేస్తుంది. 1894 బ్రిటీషు చట్టం ఏమి చెబుతుందంటే ఈ చట్టాన్ని ఉపయోగించి భూమిలేని రైతుల నుండి భూమిని సేకరించి ప్రైవేటు ప్రాజెక్టులకు ఉపయోగించవద్దని చెప్పింది. కానీ మన సర్వ స్వతంత్ర భారత ప్రభుత్వం, ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా భూమిని బలవంతంగా సేకరించి ప్రైవేటు యాజమాన్యం చేతుల్లో పెడుతుంది. ఈ రకంగా బలవంతంగా లాక్కోవటం అనే విషయం ఎవరైతే సహజ వనరుల మీద బ్రతుకుతున్నారో .. రైతులు, రైతు కూలీలు, సముద్రం మీద బ్రతుకుతున్న జాలరుల విషయంలోనే జరుగుతుంది. ఈ లాక్కోవటం కార్పోరేట్ల విషయంలో అసలు జరగదు. వాళ్ళు కార్పరేట్ జమీందారులుగా తయారు అవుతున్నారు. వాళ్ళకు వేలాది ఎకరాలు ఉన్నా వాళ్ళ జోలికి పోరు. వాళ్ళు అంబానీలు అవ్వవచ్చు, జిందాలు, మిట్టాలు అవచ్చు, తాతాలు,బిర్లాలు అవచ్చు. మొత్తం 467 మందే మిలియానీర్లు.. కాదు కాదు బిలియనీర్లు ఉన్నారిక్కడ. ఇంకో పక్క కోట్లకొలది మన ప్రజలు వారి చెమటతో, శ్రమతో పట్టణాలలో, పల్లెల్లో… భారతదేశమంతటా ఆహారాన్ని ఉత్పత్తి చేస్తూ, ప్రజల కనీస అవసరాలు తీర్చటానికి కండలు కరిగేలాగా కష్టపడుతున్నారు. ఎవరు వాళ్ళు? రాజకీయనాయకులు వారిని చీమల్లాగా, పురుగుల్లాగా చూస్తున్నారు. ఈ విషయాన్నే మనం సవాలు చేయాలి. మన రైతు జాతికి ఇవ్వాల్సిన గౌరవం కోసం పోరాడాలి. దేవసహాయంగారు చెప్పినట్లు మనం రెండవ తరగతి పౌరులం కాదు. మనం మనుషులం మాత్రమే కాదు. అనేక మానవ హక్కులు, స్వేచ్చలు ఉన్న ఈ దేశ పౌరులం కూడా. బాబాసాహెబ్ అంబేడ్కర్ రాసి రాజ్యాంగంలో పొందు పరిచిన అనేక హక్కులు ఉన్న వాళ్ళం. ఈ రాజధాని పరీవాహక అభివృద్ధి సందర్భంగా ఈ హక్కుల గురించి మనం దృవపర్చుకోవాలి.

మీకందరికి సంబంధించిన ఈ అందమైన ప్రాంతాన్ని ఈ రోజు చూశాను. ఈ ప్రాంతం అచ్చు నర్మదా లోయలాగానే ఉంది. ఇలాంటి నల్లరేగడి భూములే అక్కడ. ఇలాంటి పండ్ల తోటలే అక్కడ. అక్కడా ఇలాంటి పూల తోటలే. ఇలాంటి సమృద్ధికరమైన అందాలే నర్మదా లోయలో మునిగి పోబోతున్నాయి. 214 కిలోమీటర్ల పొడవునా 245 గ్రామాలు మోడీ ప్రభుత్వం పుణ్యాన. అది అధికారంలోకి వచ్చీ రాగానే సర్దార్ సరోవర్ ప్రొజెక్ట్ 139 మీటర్లు పెంచటానికి అనుమతి ఇచ్చింది. కోర్టులను ఆశ్రయిస్తూ, ప్రజలతో కలిసి పోరాటాలు చేస్తూ.. మేము భీకరమైన యుద్ధంలో ఉన్నాము. 30 సంవత్సరాల పోరాటం తరువాత ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు.

కానీ ఈ పల్లెల్లో చాలా వరకు భూమి మీ చేతుల్లోనే వుంది. మీరు మీ స్థానంలోనే ఉన్నారు. మీకిక్కడ ఇంకా సంపూర్ణ జీవితం ఉంది. ఈ భూమి, ఈ సౌందర్యం ఇంకా మీ చేతుల్లోనే ఉన్నాయి. వందలాది భూమి లేని దళిత స్త్రీలు.. కొద్దిగా అసైన్డ్ భూములు, లంక భూములు ఉన్న రైతులు, రైతు మరియు గ్రామీణ సహకార సంఘాల ఆఫీసు బేరర్స్ అందరూ ఒకే మాట మీద భూమిని ఇవ్వటానికి నిరాకరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో దేవసహాయంగారు, జడ్జిగారు చెప్పినట్లు మేమంతా ప్రజా ఉద్యమాలతో మీకు మద్దతు ఇస్తాము. మీ ముందు పోరాటాలలో భాగం పంచుకొంటాము. చంద్రబాబు నాయుడు మీ భూములు ఎలా తీసుకొంటాడని ప్రశ్నిస్తాము. అతను ప్రజల జీవితాలను ఎలా కబళిస్తాడని అడుగుతాము. భూసమీకరణ అనే కుతంత్ర పూరిత ఆలోచనతోనే అతను చేయగలడు. ఈ భూసమీకరణ అనేది భూసేకరణ కంటే దుర్మార్గమైనది. రైతులు, కూలీలు వ్యతిరేకిస్తున్న ఈ భూసమీకరణ ఒక్క రూపాయి డబ్బు ఇవ్వకుండా కుక్కలకు పిల్లులకు వేసినట్లు రొట్టె ముక్కలు విసిరేస్తుంది. చంద్రబాబునాయుడు మీ భూమినంతా తీసుకోవాలనుకొంటున్నాడు. రాజ్యాంగంలో వున్న ఆర్టికల్ 47 ఏమి చెబుతుందో కూడా అతను లెక్కచేయటం లేదు. వ్యవసాయము, వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులను సంరక్షించుకోవాలని అది చెబుతుంది. ప్రజలకు అవసరమైన సంపూర్ణ ఆహార భద్రత ఇవ్వాలని చెబుతుంది. ఏది అభివృద్ధి, ఏమి కాదు అనే విషయం గ్రామ సభలు మాత్రమే నిర్ణయిస్తాయనే విషయాన్ని కూడా అతను లెక్కచేయడం లేదు. మిమ్మల్ని అతను అభివృద్ధి అని చెబుతున్న క్రమంలో భాగస్వామ్యులను చేయడం లేదు. అతను కేవలం సింగపూర్ కంపెనీలు, వారి పెట్టుబడులు, వారి లాభాల గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడు. వాళ్ళ లాభాల్లో అధికార పార్టీలకు భాగాలు ఉంటాయి. ఇప్పుడంతా స్పష్టంగా ఉంది. అన్ని ప్రజాస్వామిక సూత్రాలకు, మానవ హక్కులకు వ్యతిరేకంగా ఈ ప్రదేశమంతా విధ్వంసానికి గురి కాబోతుంది. చంద్రబాబు నాయుడు ఈ పనికి ధైర్యం చేస్తున్నాడు.

అయితే మీరు దీన్ని సవాలు చేస్తే , వద్దని చెప్పగలిగితే, ఏకగ్రీవంగా నిర్ధారిస్తే … మేము ఈ రోజు తిరిగిన ప్రాంతాల్లో అందరితో చర్చించి వచ్చిన నిర్ధారణ ఏమిటంటే మీరు గతంలో యిచ్చిన అంగీకారం చెల్లదని. సుధారాణిగారు! (సుధారాణిని వత్తిడికి గురిచేసి సంతకం చేయించారు. ||అను||) వాళ్ళు మిమ్మల్ని సంతకం చేయమని బలవంతం చేసినప్పటికీ, మీరు చేసినప్పటికీ ఇప్పుడు ఈ రాలీలో మళ్ళీ నేను నా అంగీకారాన్ని వెనక్కి తీసుకొంటానని ఇంకో ఫారం మీద సంతకం చేయవచ్చు. మీ అంగీకారాన్ని స్వతంత్రంగా యిచ్చినట్లైతే, వెనక్కి తీసుకోవటం కూడా స్వతంత్రంగానే చేయవచ్చు. ‘మేము స్వతంత్రంగా ఇవ్వలేదూ…. భయంతో వత్తిడితో ఇచ్చాము’ అనేవాళ్ళు చేతులు ఎత్తండి. (చాలా మంది సభలో చేతులు ఎత్తారు. ||అను||) దురదృష్టవశాత్తు ఇక్కడ లైటింగ్ బాగా లేదు. రైతులు చీకటిలో ఉన్నారు. పోరాడదాం. జయిద్దాం. భూమి మనది. ఎవడబ్బదీ కాదు. (లడేంగే. జీతేంగే. జమీన్ హమారా ఆప్ కీ. న కిసీకి బాప్ కీ) ఇది హిందీ స్లోగన్. (ఆమె నవ్వు)

ఇది జరగాలి. ఎందుకంటే మీరు చారిత్రాత్మక బాధ్యత నిర్వహించాలి. భూసమీకరణ ఒక దారి దోపిడీ. ఈ కుట్రపూరిత యత్నం కేవలం చంద్రబాబుదే కాదు. జూన్ ఒకటిన నరేంద్ర మోడి ఇక్కడకు వచ్చి భూసమీకరణ భూసేకరణకంటే మంచిదని చెబుతాడు. ఈ దుష్ట డిజైన్ ను మంగళగిరిలో, భోగాపురంలో రాబోతున్న కొత్త ఎయిర్ పోర్టులకి వర్తింపచేద్దామని అంటాడు. అప్పుడు 29 నుండి వంద గ్రామాల దాకా రాజధాని ప్రాంతంలో చేర్చబడతాయని అంటున్నారు. అప్పుడు మనం ఊహించని పరిణామాలు జరుగుతాయి. భూమిని సమీకరిస్తారు అంటే భూమితో బాటు సంబంధం ఉన్న ప్రతి దాన్ని కూడా. మిలియన్ల డాలర్ల విలువ చేసే భూగర్భ సంపదను కూడా. భూమిని హైవేల కోసం, రైల్వేల కోసం కూడా సమీకరిస్తారు. భూసమీకరణ చట్టంలో తీసుకొని వస్తున్న కొత్త మార్పులు ఏమి చెబుతున్నాయంటే హైవేలకూ, రైల్వేలకూ అటూ ఇటూ ఒక కిలో మీటరు వరకు ప్రభుత్వం భూమిని సమీకరణ చేయవచ్చని. ఊహించండి, ఒక కిలోమీటర్ దూరం అంటే. ఇల్లుంటాయి, షాపులు ఉంటాయి, మార్కెట్టులు ఉంటాయి. హోటళ్లు ఉంటాయి. వాళ్ళకు అవేమీ పట్టవు. కార్పరేట్లు సంతోషంగా ఉండి వచ్చే ఎలక్షన్లకు ఫండ్స్ యిస్తే చాలు.

మేము సువాసనలతో కూడిన మల్లె తోటలను చూసాము. గులాబీ తోటలనీ, అరటి తోటలనీ చూసాము. ఎక్కడ చూసిన ఆర్ధికశాస్త్రం చెబుతున్నది ఏమిటంటే భూమిలేని కూలీలకు ఇక దొరకబోతుంది 2500 మాత్రమే. ఇరవై శాతం భూములు మీకు తిరిగి ఇచ్చేసినా, వందశాతం భూములు తీసుకొని, ఇరవై శాతం భూములు తిరిగి ఇవ్వటం అనే ప్రతిపాదనకు తెలివిలేని వాళ్ళే ఒప్పుకొంటారు. మీ చేతులనుండి లక్షలకు తీసుకొన్న పొలం కొద్ది రోజుల్లోనే కోట్లకు చేతులు మారుతుంది. మీరు ఇక ఏడ్చి, మీ పిల్లలకు ఈ అమితమైన విలువ కలిగిన భూమిని కొనాలని అనుకొంటే అప్పుడు అది బంగారం అవుతుంది. అప్పుడు మీరు వాళ్ళకు ఏమీ చేయలేరు. పిల్లల భవిష్యత్తుకు ఏమి చేయలేనివారిగా మిగిలి పోతారు. చాలా మంది రైతులు, కూలీలు ఈ లెక్కలు వేసుకోకుండా బెదిరింపులకు, భయాలకు లొంగి భూములు ఇచ్చారు.

ఇది మీకు జరుగుతుందని నేను అనుకోవటం లేదు. మేమంతా మీతో ఉంటాము. కానీ మీ స్థానిక నాయకత్వమే ఒక నిర్ణయం తీసుకోవాలి. రాజుగారు, ఎన్ఐపిఎం, పీవోడబ్ల్యూ, ఎఐకెఎంఎస్.. ఇంకా చాలా సంస్థలు ముందుకు వచ్చాయి. మీకు సహకారంగా ఉన్నాయి. ఏ ఉద్యమానికైనా కావాల్సిన సమిష్టి నాయకత్వం మీకిక్కడ ఉంది. మీకు స్పష్టమైన మద్దతు నిచ్చిన రాజకీయ పార్టీలవారు, రేపు వాళ్ళు అధికారంలోకి వచ్చినా కూడా వారి మాట మీదే నిలబడాలని మీరు హామీలు తీసుకోవాలి. వాళ్ళు మనతోనే ఉండి, ఒక స్థానం తీసుకోవటం చాలా అవసరం.

ఎందుకు వ్యవసాయిక ఉత్పత్తులకు తక్కువ ధరలు ఉంటాయి? ఎందుకు రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు? ఎందుకు పెట్టుబడిదారులు ఆత్మహత్యలు చేసుకోవడం లేదు? ఎందుకు రైతుల సంపదలే బలవంతపు సమీకరణలకు గురి అవుతున్నాయి? ఎందుకు రైతుల భూములే కొనాలనుకొంటున్నారు? పెట్టుబడిదారుల ఎకరాలు వేలకు వేలు పడి ఉంటే వాటి జోలికి ఎందుకు వెళ్ళటం లేదు? ఎందుకు వాతావరణం అనుకూలించనప్పుడూ, పంట మిగిలి పోయినప్పుడూ రైతులకు పరిహారం ఇవ్వటం లేదు? కార్పరేట్లకు గత 10 సంవత్సరాలలో 36.5 లక్షల కోట్ల పన్ను మినహాయింపు యిచ్చినపుడు రైతులకు ఎందుకు పరిహారం ఇవ్వటం లేదు? ఎందుకు అన్ని పార్టీల ప్రభుత్వాలు రైతులను నిర్లక్షం చేసి, అగౌరపరుస్తున్నాయి?

మిత్రులారా! ఇదే సమయం. రైతులు ఉద్యమించాలి. రైతుకూలీలు, చేపలు పట్టేవాళ్లు, చిన్న చిన్న వ్యాపారస్తులు, చిన్న పెట్టుబడిదారులు .. వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళంతా ఉద్యమించాలి. వ్యవసాయం మనకు గర్వకారణమైనది. దాన్ని రక్షించుకోవాలి. భూములనూ, నదులనూ, భూగర్భజలాలను బాటిలింగ్ కంపనీలకు యిస్తున్నారు. కొండలు, పర్వతశ్రేణులు.. అన్నీపోతున్నాయి. ఆఫ్రికాఖండంలో ఉన్న ఇధియోపియాలాగా మన దేశం తయారు అవుతుంది.

ఇది మనకు జరగకూడదు. దేశంలో వందలు, వేలకొలది ఆర్గనైజేషన్స్ సమీకృతం అవుతున్నాయి. రైతులు, రైతుకూలీలు, చేపలు పట్టే వారికి ఉపయోగపడేవిధంగా ‘భూమీ అధికార్ ఆందోళన్’ కు సానుకూలంగా స్పందిస్తున్నాయి. సమిష్టి దృక్పధం ఇలాంటి విషయాల్లో చాలా అవసరం. మీ విషయంలో శివనారాయణ కమిటీ ఇప్పటికే ప్రతిపాదనలు చేసింది. ఇక్కడకు వచ్చిన యాక్టివిష్టులూ, మాజీ ఉధ్యోగస్తులు, మాజీ జడ్జిగారు, శోభా నాగేశ్వరరావుగారు, ఇంకా ఈ ప్రాంతం నుండి వచ్చిన ఇతర రాజకీయ నాయకులు …. మనందరం ఒకటని ఆశిస్తున్నాను. థాంక్యూ వెరీ మచ్. ఈ రోజంతా మీతో గడపటం ఆనందంగా ఉంది. కొన్ని నినాదాలు యిద్దాం.

రైతుల ఐక్యత వర్ధిల్లాలి

మహిళా శక్తి వర్ధిల్లాలి

దళిత, ఆదివాసీ ఐక్యత వర్ధిల్లాలి

రైతు, రైతుకూలి ఐక్యత లడేంగే .. జీతేంగే

చంద్రబాబునాయుడు, ఖోష్ మే ఆవో”

Next Story