Telugu Global
POLITICAL ROUNDUP

నీతివంతమైన అవినీతి

ఆత్మహత్య ఇక్కడ అధికారక నేరం!.. ఆకలితో చావడం అనధికార న్యాయం…! అందుకే ప్రజాస్వామ్యంలో నీతివంతమైన అవినీతి చెల్లుబాటు అవుతుంటుంది. సమాజ స్వరూపాన్ని సంపూర్ణంగా మార్చేయగల శక్తి ఈ నీతివంతమైన అవినీతికి చాలా చాలా ఎక్కువ. చెప్పాలంటే ప్రాథమికంగా -నీతివంతం కానిది ఏదైనా అవినీతే. అయితే విచిత్రంగా ఆర్థిక విషయాల్లో మాత్రమే అవినీతి స్థిరపడిపోయి అస్తిత్వం చాటుకుంటోంది. కాదు..కాదు బలవంతంగా సమాజం మీద రుద్దబడుతోంది. ఎంచేతనంటే దీని వలన ఒనగూరే ప్రయోజనాలకు కామాలు తప్పించి ఫుల్‌స్టాప్‌లుండవు. పాలకవర్గ రాజకీయార్థిక వ్యవస్థల్లో […]

నీతివంతమైన అవినీతి
X

ఆత్మహత్య ఇక్కడ అధికారక నేరం!..
ఆకలితో చావడం అనధికార న్యాయం…!

అందుకే ప్రజాస్వామ్యంలో నీతివంతమైన అవినీతి చెల్లుబాటు అవుతుంటుంది. సమాజ స్వరూపాన్ని సంపూర్ణంగా మార్చేయగల శక్తి ఈ నీతివంతమైన అవినీతికి చాలా చాలా ఎక్కువ. చెప్పాలంటే ప్రాథమికంగా -నీతివంతం కానిది ఏదైనా అవినీతే. అయితే విచిత్రంగా ఆర్థిక విషయాల్లో మాత్రమే అవినీతి స్థిరపడిపోయి అస్తిత్వం చాటుకుంటోంది. కాదు..కాదు బలవంతంగా సమాజం మీద రుద్దబడుతోంది. ఎంచేతనంటే దీని వలన ఒనగూరే ప్రయోజనాలకు కామాలు తప్పించి ఫుల్‌స్టాప్‌లుండవు.

పాలకవర్గ రాజకీయార్థిక వ్యవస్థల్లో మార్పులు రానంతవరకు అవినీతి, ఆశ్రితపక్షపాతంలో మార్పులు రావని చాలామంది రాజనీతిజ్ఞులు ఎరుగుదురు. పాలనలో అవినీతి అనేది పైన చెప్పిన రాజకీయార్థిక విధానాల వైఫల్యాల ప్రతిఫలనం. అంతేకాదు ఆయా వ్యవస్థల పర్యావసానమే అవినీతి. మరి ఆ వ్యవస్థల్లో సమూల మార్పు జరగకుండా అవినీతిని దూరం చేయగలరా? కానీ నీతివంతమైన అవినీతి నేతలు మాత్రం
అవినీతిని అంతమొందిస్తామనే చెబుతారు. ఇది చాలా విచిత్రమైన, సామాన్యుని ఊహకు సైతం అందని, ఆలోచనకు పట్టని మాట. ఎందుకంటే పంటకు చీడ వదలదు. కానీ చీడ లక్షణాలను సంహరిస్తాం అనడం. దీని వలన ఉపయోగం ఏమిటి? మూలాల్లో మార్పు రానంతవరకు
ప్రయోజనం ఉండదు కదా!. అంతర్గత స్వరూపం భయానకంగా ఉన్నా పర్వాలేదు… ఉపరితలం ఆకర్షణీయంగా ఉంటే చాలా??… దీనికి చాలా జాగ్రత్తగా ముసుగులు తొడిగి చాలామంది అవినీతి ఏ ఒక్క వ్యక్తికో ఆపాదించి సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తుంటారు.

అందలం ఎక్కాలనుకున్న వర్గాలకు ఇంకే ఆధారమూ లేనప్పుడు అవినీతి అనే పదం ఒక అద్భుత ఆయుధం. అందరూ అభివృద్ధి గురించి మాట్లాడేటప్పుడు అందులో అంతులేని అవినీతి ఉందని క్రమంగా ప్రచారం చేయడం, రాజకీయకక్షలో భాగంగానే కొన్ని చట్టాలను
సదరు వ్యక్తిపై ప్రయోగించి ఇదిగో ఇతడు అవినీతిపరుడు అని ముద్రవేయగలిగితే చాలు అధికారం సొంతమవుతుంది. చెప్పాలంటే ఇది మానవ సమాజంలోనే అన్నిటికీ మించిన నీతి మాలిన పని. అంటే అతిపెద్ద అవినీతి. అయితే ఇలాంటి కుట్రలు అవినీతిగా సమాజం గుర్తించదు. కేవలం
సంపద పోగేసుకున్నారనే ప్రచారాన్నే అవినీతిగా భ్రమిస్తుంది. నమ్ముతుంది. ఇలాంటి నీతివంతమైన అవినీతి ఎన్నటికీ బయటకి కనిపించదు. ఎందుకంటే అది రాజకీయ పరిభాష అయిన రాజనీతిలో అప్పటికే ఇంకిపోయి ఉంటుంది.

రైతుల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి, దానినే చిలువలు పలువలుగా ప్రచారం చేసి, జిల్లాల వారీగా లెక్కలు తీసి అధికారంలోని వచ్చాక ఇదంతా కూడా మాఫీ అని చెప్పి మరీ పాలన చేపట్టాక మాఫీ చేయకపోవడం అతిపెద్ద అవినీతి. రైతుల బతుకులపై వేసే అంతం కాని జోక్‌ ఇది.
కాకపోతే -ఇదంతా నీతివంతమైన అవినీతి కాబట్టి సమాజానికి అవినీతిగా కనిపించదు. ఉచిత విద్యుత్‌ ఇస్తామని చెప్పి ఇచ్చాక, ఇంకో అభివృద్ధి కార్యక్రమంలో కోట్లు తినేసారని గగ్గోలు పెట్టి దానినే అవినీతిగా చూపించడమే నీతివంతమైన అవినీతి. వివిధ రుణ మాఫీలు జరిగితీరుతాయనీ… కష్టాలు గట్టెక్కుతాయనీ, పెన్షన్లు వస్తాయనీ… భరోసా దొరుకుతుందనీ, చదువు, ఉద్యోగం వగైరాలన్నిటికీ తగిన ఆసరా దొరుకుతుందనుకున్న జనం అదేదీ జరగకపోతే దానిని నీతి లేని పనిగా, ముఖ్యంగా అవినీతిగా గుర్తించరు. ఎందుకంటే అప్పటికే అవినీతికి అర్థం మార్చి జనాలను ఏమార్చి ఉంటారు కాబట్టి. అయితే నీతివంతమైన అవినీతి నేతలకు మాత్రం ఇది ఎవరూ క్షమించలేని అవినీతి అని తెలిసి ఉండటమే ప్రజాస్వామ్యంలో విషాదం.

సమాజంలో పైకి కనిపించని ఎన్నో ప్రభావక శక్తులకు అధికారంలోకి రావాలని ఉంటుంది. అయితే ఆ వర్గమంతా నేరుగా తమ ప్రయోజనాలు సాధించుకోవడానికి వీలుండదు. అంచేత వీరంతా నీతివంతమైన అవినీతినే ఆశ్రయించాల్సి ఉంటుంది. మన దేశంలోనూ, ఇతర దేశాల్లోనూ చాలా కార్పొరేట్‌ ఫౌండేషన్‌లు విస్తృతంగా పనిచేస్తుంటాయి. సేవలందిస్తుంటాయి. ఇవన్నీ కూడా రాజకీయనేతలకు శిక్షణ ఇస్తుంటాయి. వీరి లక్ష్యం ఒకటే ‍తమ ప్రయోజనాలను నెరవెర్చే శక్తులకు తోడ్పాటునందించడం. కార్పొరేట్‌ భావజాలం ఉన్నవారు అధికారంలోకి వచ్చేలా చూడటం. ఇదంతా అంతర్గతంగా జరిగే భయానక అవినీతి. ఉపరితలానికి ఎంతో సౌందర్యవంతంగా కనిపిస్తుంది. సమాజం అవినీతికి అసలైన అర్థం ఎన్నటికి గుర్తిస్తుందో, దీనినంతా ఎప్పటికి అవినీతిగా గుర్తిస్తుందో తెలియదు. అప్పటి వరకు నీతివంతమైన అవినీతికి జిందాబాద్‌.
-సంఘమిత్ర

First Published:  16 April 2015 1:21 AM GMT
Next Story