Telugu Global
Family

సంశయాత్మా వినశ్యతి

భగవద్గీతలో సంశయాత్మా వినశ్యతి 'అన్న మాట వుంది. సందేహించిన వాడు నశిస్తాడు' అని ఆ మాటకు అర్ధం. దానికి దృష్టాంతమయిన కథ ఇది. ఒక గ్రామంలో ఒక సాధువు ధర్మ ప్రవచనాలు చేసేవాడు. ఆయన ఉన్నత ఆధ్యాత్మిక శిఖరాల్ని అందుకున్నవాడు.భూత భవిష్యత్‌ వర్తమనాలు తెలిసిన జ్ఞాని. ఆయన ప్రవచనాలు వినడానికి ఎందరో భక్తులు వచ్చే వాళ్ళు.

Samsayatma Vinasyati in Telugu
X

భగవద్గీతలో సంశయాత్మా వినశ్యతి 'అన్న మాట వుంది. సందేహించిన వాడు నశిస్తాడు' అని ఆ మాటకు అర్ధం. దానికి దృష్టాంతమయిన కథ ఇది.

ఒక గ్రామంలో ఒక సాధువు ధర్మ ప్రవచనాలు చేసేవాడు. ఆయన ఉన్నత ఆధ్యాత్మిక శిఖరాల్ని అందుకున్నవాడు.భూత భవిష్యత్‌ వర్తమనాలు తెలిసిన జ్ఞాని.

ఆయన ప్రవచనాలు వినడానికి ఎందరో భక్తులు వచ్చే వాళ్ళు. ప్రతిరోజూ ఒక స్త్రీ శ్రద్ధగావచ్చి కూర్చుని సాధువు సత్యవాక్యాన్ని వినేది. ఆయన చెప్పే ప్రతిమాటను హృదయపూర్వకంగా స్వీకరించేది. ఎప్పుడు ఎవరితోనూ ఏమీ మాట్లాడేది కాదు. ప్రవచనాల అనంతరం నిశ్శబ్దంగా నిష్క్రమించేది.

కానీ ఆమె ముఖం ఎప్పుడూ దీనంగా వుండేది. దిగులుగా వుండేది. ఏదో కోల్పోయినట్లు విషాదం ఆమె ముఖంలో కనిపించేది. ఒకరోజు ప్రవచనాల అనంతరం అందరూ వెళ్ళిన తరువాత ఆమె సాధువుకు నమస్కరించి వెళ్ళడానికి సిద్ధపడింది.

అప్పుడు సాధువు 'అమ్మా! ఎన్నాళ్ళనించో నిన్ను చూస్తున్నాను. నువ్వు సౌమ్యురాలవి. సౌశీల్యవతివి. కానీ నాకొక సందేహం. ఎప్పుడూ నువ్వు దిగులుగా ఎందుకువుంటావు. ఏదో కోల్పోయినట్లు ఎందుకు వుంటావు. నీ కేదయినా సమస్యవుంటే చెప్పు. నాకు వీలయితే ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను' అన్నాడు.

ఆ స్త్రీ కన్నీళ్ళతో 'స్వామీ! ఏం చెప్పమంటారు? నా భర్త సైన్యంతో బాటు యుద్ధరంగానికి వెళ్ళి రెండు సంవత్సరాలయింది. యుద్ధం ముగిసి పోయిందని, సైనికులంతా వాళ్ళ వాళ్ళ నివాసాలకు వచ్చేశారని తెలిసింది. కానీ మా ఆయన ఆచూకీ తెలియలేదు. ఆయన ఎక్కడున్నాడో ఎప్పుడు వస్తారో కూడా ఎవరూ చెప్పడం లేదు. ఆయన వస్తాడో రాడో కూడా తెలీడంలేదు. నా పరిస్థితికి కారణం అది.ఈ విషయంలో మీరు నాకు సహాయ పడగలరా?' అంది.

సాధువు ఆమె దీనవదనాన్ని చూసి జాలిపడ్డాడు. కదిలిపోయాడు. వెంటనే 'అమ్మా! దిగులు పడకు. మీ ఆయన రేపు సాయంత్రం మీ యింటికి తిరిగివస్తాడు. నిశ్చింతగా వుండు' అన్నాడు.

ఆ మాటల్తో ఆమె ముఖంలోని దిగులు మాయమైపోయింది. మొఖంలో కాంతి కదిలింది. ఆనందంగా యింటికి తిరిగివచ్చి యింటిని పరిశుభ్రం చేసింది. మరసటి రోజు సాయంత్రం కల్లా యిల్లంతా పూలతో అలంకరించింది. మంగళ తోరణాలు కట్టింది. దీపాలు పెట్టి యిల్లంతా వెలుగు నింపింది. మంగళస్నానం చేసి పట్టువస్త్రాలు అలంకరించి పరవశంగా భర్తకోసం ఎదురు చూపింది.

సూర్యాస్తమయ మవుతుండగా ఆమె భర్త గుర్రం మీద వచ్చిదిగాడు. రెండేళ్ళు తన జాడ లేకపోవడంతో తన భార్య ఎంత తల్లడిల్లిపోయిందో, చిక్కి శల్యమయిపోయిందో అనుకున్నాడు. తన అనుభవాల్ని, పడిన కష్టాల్ని, ఆలస్యానికి కారణాన్ని అన్నీ ఆమెతో చెప్పుకోవాలని ఆరాటపడ్డాడు.

కానీ తనయింటిని చూస్తే పరిస్థితి అలాలేదు. పండుగవాతావరణం వుంది. తన భార్య ఆనందంగా పట్టు బట్టల్తో కళకళ లాడుతోంది. భర్త రాకతో మంగళ హారతితో ఆమె యింటి బయటికి వచ్చింది. ఆనందంతో ఆమె ముఖం వెలిగిపోయింది.

భర్త ఆగ్రహం కట్టలు తెంచుకుంది. 'నేను రెండేళ్ళ పాటు లేకున్నా నువ్వు హాయిగా వున్నావు. స్వేఛ్ఛగా నీ ఆటలు ఆడుతున్నట్లున్నావు. అడ్డూ అదుపూ లేదు కదా! నువ్వు పతితవు' అని ఆమెను దుర్భాషలాడాడు.

ఆ మాటల్తో ఆమె హతాశురాలై 'అయ్యో! అంత మాట అనకండి. ఈ వూళ్ళోని సాధుపుంగవుడు మీరు ఈ రోజు వస్తారని అన్నాడు అందుకనే ఈ అలంకరణ అంతా' అన్నాడు.

'బాకా బంకులు కూడా నేర్చావు. నువ్వు అంతసమర్ధురాలయ్యావు' అన్నాడు. అంతలో ఆ సాధువు వాళ్ళయింటి దగ్గర పరిస్థితి ఎలా వుందో చూద్దామని వచ్చాడు. భార్యా భర్తల మధ్య జరుగుతున్న గొడవ చూశాడు.

ఆమె సాధువును చూసి 'స్వామీ! మీరే కదా ఈ రోజు నా భర్త వస్తాడని చెప్పారు' అంది. సాధువు అవునన్నాడు. ఆమె భర్త! 'మీరు అంతశక్తి సంపన్నులయితే, మీరు నేను వస్తానని చెప్పివుంటే ఈ నా గుర్రం గర్భంతో వుంది. దాని కడుపులో వున్నది ఆడోమగో చెప్పండి' అన్నాడు.

తప్పని సరయి సాధువు 'మగపిల్ల' అన్నాడు. భార్య వారిస్తున్నా వినకుండా ఆమె భర్త కత్తి తీసి గుర్రం కడుపు చీల్చి చూశాడు. మగ గుర్రం పిల్ల గర్భంలో వుంది. ఆ దృశ్యం చూసి విషాదంలో యింటికి వెళ్ళి సాధువు ధ్యానంలో కూర్చుని ప్రాణాలు వదిలాడు. ఆ సంగతి తెలిసి ఆమె సాధువు, గుర్రం మరణాలకు తనే కారణమని భావించి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.

ఉత్తమురాలయిన తన భార్య, ఉన్నతుడయిన సాధువు, నోరు లేని గుర్రాల మరణానికి తనే కారణమని భర్త కత్తితో పొడుచుకుని చనిపోయాడు.

- సౌభాగ్య

First Published:  12 April 2015 9:15 PM GMT
Next Story