Telugu Global
NEWS

దుర్గమ్మ సన్నిధిలో అవస్థలెన్నో...

రాష్ట్రంలోనే అతిపెద్ద దేవాలయాల్లో విజయవాడలోనే ఉన్న కనకదుర్గమ్మ దేవస్థానం రెండోస్థానంలో ఉంటుంది. కోట్లాది రూపాయల ఆదాయం భక్తుల ద్వారా లభిస్తోంది. నిత్యం రాష్ట్రం నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి కూడా భక్తులు కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. అనేక వ్యయప్రయాసాలకోర్చి మొక్కుబడులను తీర్చుకునేందుకు వచ్చే భక్తులకు కనకదుర్గమ్మ ఆలయం ప్రాంతం నరకం చూపిస్తుంది. నిత్యం ట్రాఫిక్ రద్దీ, ప్రమాదాలు, ప్రాణాలు కోల్పోటం వంటి సంఘటనలు ఇక్కడ తరచూ జరుగుతూ ఉంటాయి. నెలలో నాలుగైదు మార్లు […]

దుర్గమ్మ సన్నిధిలో అవస్థలెన్నో...
X

రాష్ట్రంలోనే అతిపెద్ద దేవాలయాల్లో విజయవాడలోనే ఉన్న కనకదుర్గమ్మ దేవస్థానం రెండోస్థానంలో ఉంటుంది. కోట్లాది రూపాయల ఆదాయం భక్తుల ద్వారా లభిస్తోంది. నిత్యం రాష్ట్రం నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి కూడా భక్తులు కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. అనేక వ్యయప్రయాసాలకోర్చి మొక్కుబడులను తీర్చుకునేందుకు వచ్చే భక్తులకు కనకదుర్గమ్మ ఆలయం ప్రాంతం నరకం చూపిస్తుంది. నిత్యం ట్రాఫిక్ రద్దీ, ప్రమాదాలు, ప్రాణాలు కోల్పోటం వంటి సంఘటనలు ఇక్కడ తరచూ జరుగుతూ ఉంటాయి. నెలలో నాలుగైదు మార్లు సీఎం కూడా విజయవాడ వస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు అనునిత్యం బెజవాడలో ఉన్న కనకదుర్గమ్మ వారిని దర్శించుకుంటారు. అయినా అక్కడ ఉండే అసౌకర్యాలను, భక్తులకు కల్పించాల్సిన కనీస వసతులనూ పట్టించుకునే స్థితిలో లేరు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనకదుర్గమ్మ గుడి వద్ద రోడ్ విస్తరణ చేపడతామని, ఫ్లై ఓవర్ నిర్మిస్తామని, రోప్ వే నిర్మాణం చేస్తామని నమ్మబలికన తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారంలోకి వచ్చాక ఆ మాటలన్నీ మర్చిపోయారు. దీంతో భక్తులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు.

విజయవాడ నగరంలో రోప్ వే ఏర్పాటు కల్లగానే మారిపోతోంది. నిత్యం 5 వేల మందికి తక్కువ కాకుండా దుర్గగుడికి వచ్చే భక్తులు ఉండగా ఇంద్రకీలాద్రిపైకి రోప్ వే వేయటానికి ఏపీటీడీసీ ఐదేళ్ళుగా జాప్యం చేస్తోంది. నాడు లాభదాయకమైన ఈ ప్రాజెక్ట్ ను అత్యంత ఉత్సాహంగా ఎంచుకుని ఇప్పుడెందుకో కాలదన్నుకుంటోంది. రాజధాని సమీపంలో ఉంటున్న నగరానికి కళ తీసుకురావటానికైనా మూలన పడేసిన ఈ ప్రాజెక్ట్ ఫైల్ ఏపీటీడీసీ పరిశీలించాల్సి ఉంది. ఇరిగేషన్ అభ్యంతరాలుంటే పీఎన్బీఎస్ నుంచి నేరుగా దుర్గగుడికి రోప్ వే ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలన జరపాల్సి ఉంది.

ఇంద్రకీలాద్రికి రోప్ ప్రాజెక్ట్ ను ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఏపీటీడీసీ) చేజేతులా కాలదన్నుకుంటోంది. పొరుగు జిల్లాలో ఉన్న కోటప్పకొండపై చూపుతున్న‌ వాత్సల్యంలో కాసింత కూడా ఇంద్రకీలాద్రిపై చూపటం లేదు. నిన్నటి వరకు ఇరిగేషన్, దేవాదాయ శాఖలతో పేచి ఉండగా, నేడు ఏపీటీడీసీలోనే చిత్తశుద్ధ లోపిస్తోంది. రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద దేవస్థానికి నిలయంగా ఉన్న ఇంద్రకీలాద్రికి ‘రోప్ వే’ ఏర్పాటు చేయటానికి ఐదేళ్ళ కాలహరణం ఇప్పటికే జరిగిపోయింది. దుర్గగుడికి రోప్ వే వేయాలన్న ప్రతిపాదనను చెత్తబుట్టలో పడవేసి, ఇతర శాఖలు చేపట్టలేక వదిలి వేసిన రోప్ వేలను తలకంటించుకోవాలని ఏపీటీడీసీ చూస్తోంది. పోనీ అవి అయినా పట్టాలెక్కుతున్నాయంటే అదీలేదు.

టూరిజం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. వినూత్న ఆలోచనలతో కూడిన ప్రాజెక్ట్ ల ప్రతిపాదనలతో వస్తే వాటికి ఆమోదం తెలుపుతామని ప్రభుత్వం చెబుతోంది. ఎంతోమందికి ఉపాధి, ఉల్లాసం కల్గించటంతోపాటు ఆదాయాన్ని తెచ్చిపెట్టే శాఖ ఏదైనా ఉందంటే అది పర్యాటకమే. మిగిలిన ప్రభుత్వ శాఖల మాదిరి కాకుండా పర్యాటకాభివృద్ధి ద్వారా ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం వస్తుంది. మెరుగైన పర్యాటకాభివృద్ధి ప్రాజెక్ట్ లు తలకెత్తుకుంటే.. పర్యాటకుల ఆదరణ ఎల్లప్పుడూ ఉంటుంది. విజయవాడలో సీతమ్మవారి పాదాలు, రాజీవ్ గాంధీ పార్కుల నుంచి ఇంద్రకీలాద్రికి రోప్ వే ఏర్పాటు చేయటానికి ప్రతిపాదనలున్నాయి. అప్పటి డీవీఎం వెంకటేశ్వరరావు రోప్ వే ఏర్పాటుకు సంబంధించి ఎంతో కృషి చేశారు. ఇదే సందర్భంలో ఎన్నో అడ్డంకులు వచ్చాయి. అన్నింటినీ ఎదుర్కొని విజయం సాధించారు. ఆర్కియాలజీ, దేవాదాయ శాఖ, వైదిక కమిటీ, సర్వే శాఖలను ఒప్పించి సానుకూలం చేశారు. చివర్లో సీతమ్మవారి పాదాల దగ్గర నుంచి రోప్ వే ప్రారంభించటానికి ఇరిగేషన్ శాఖ అభ్యంతరం తెలిపింది. ఇరిగేషన్ ఇవ్వకపోతే రాజీవ్ గాంధీ పార్కులో స్థలం మేమిస్తామని కార్పొరేషన్ ముందుకొచ్చింది. ఆ తర్వాత వచ్చిన ఏపీటీడీసీ అధికారులు ఈ రోప్ వే ప్రతిపాదనను గాలికి వదిలేశారు.

పీఎన్బీఎస్ నుంచి దుర్గగుడికి.. రాజీవ్ గాంధీ పార్క్ నుంచి రోప్ వే వేయటంకంటే కూడా ఆసియాలోనే రెండో అతిపెద్ద బస్ స్టేషన్ అయిన పీఎన్బీఎస్ నుంచి దుర్గగుడికి రోప్ వే ఏర్పాటు చేస్తే ఇటు ఆర్టీసీకి, అటు ఏపీటీడీసీ, దుర్గగుడికి ఉభయతారకంగా ఉంటుంది. బస్ స్టేషన్ కు వచ్చిన ప్రయాణికులు నేరుగా ఇక్కడి నుంచి ఇంద్రకీలాద్రికి వెళ్ళవచ్చు. ఇంద్రకీలాద్రిపై దర్శనం చేసుకున్న భక్తులు నేరుగా బస్ స్టేషన్ చేరుకోవచ్చు. భక్తులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.

First Published:  9 April 2015 7:03 PM GMT
Next Story