కవితాత్మక చిత్రకారుడు శీలావీ..
నవలా రచయితగా, కవిగా, చిత్రకారుడిగా, కథకుడిగా శీలా వీర్రాజు తెలుగు పాఠకులకు చిరపరిచితులు. రెండు మూడు దశాబ్దాల పాటు వెలువడిన తెలుగు పుస్తకాలలో చాలా పుస్తకాలపై వీర్రాజు గారి ముఖచిత్రాలే కనిపించేవి. విద్యార్థిదశ నుంచే ఆయన ముఖపత్ర రచన చేసేవారు. రచయితగానే కాకుండా చిత్రకారుడిగా కూడా వీర్రాజుగారు వాస్తవాలకు, నడుస్తున్న సామాజిక జీవితానికి దగ్గరగా ఉంటారు. ఆయన చిత్రకళకు వస్తువులు గ్రామీణ దృశ్యాలు, సామాన్యుల జీవితాలు. అందువల్లే ఆయన చిత్రాల్లో శ్రమజీవుల వృత్తి దృశ్యాలు, గ్రామీణ స్త్రీల పనిపాటలు, పండుగలు, రైతులు, మన ఆచార వ్యవహారాలకు సంబంధించిన […]

నవలా రచయితగా, కవిగా, చిత్రకారుడిగా, కథకుడిగా శీలా వీర్రాజు తెలుగు పాఠకులకు చిరపరిచితులు. రెండు మూడు దశాబ్దాల పాటు వెలువడిన తెలుగు పుస్తకాలలో చాలా పుస్తకాలపై వీర్రాజు గారి ముఖచిత్రాలే కనిపించేవి. విద్యార్థిదశ నుంచే ఆయన ముఖపత్ర రచన చేసేవారు.
రచయితగానే కాకుండా చిత్రకారుడిగా కూడా వీర్రాజుగారు వాస్తవాలకు, నడుస్తున్న సామాజిక జీవితానికి దగ్గరగా ఉంటారు. ఆయన చిత్రకళకు వస్తువులు గ్రామీణ దృశ్యాలు, సామాన్యుల జీవితాలు. అందువల్లే ఆయన చిత్రాల్లో శ్రమజీవుల వృత్తి దృశ్యాలు, గ్రామీణ స్త్రీల పనిపాటలు, పండుగలు, రైతులు, మన ఆచార వ్యవహారాలకు సంబంధించిన దృశ్యాలే ఎక్కువగా కనిపిస్తాయి.
వీర్రాజు గారి చిత్రాలు చూస్తుంటే మనకు తెలియకుండానే గత స్మృతుల్లోకి వెళ్ళిపోతాము. మన బాల్యంలో గ్రామాల్లో చూసిన దృశ్యాలు, మనం బాల్యంలో ఆడి మరిచిపోయిన ఆటలు, పండుగల సందర్భంగా ఆచరించిన ఆచార వ్యవహారాలు చూసిన దృశ్యాలు గుర్తుకు వస్తాయి.
వీర్రాజు గారు 22 ఏప్రిల్ 1939లో రాజమండ్రిలో జన్మించారు. అక్కడే ప్రభుత్వ కళాశాలలో బి.ఏ. చేశారు. విద్యార్థి దశనుంచే కథలు, నవలలు, కవిత్వం వ్రాసిన వీర్రాజుగారు దామెర్ల రామారావు చిత్ర శిల్ప కళాశాల ప్రిన్సిపాల్ వరద వెంకటరత్నం గారి వద్ద చిత్రకళను అభ్యసించి, దానిపై అధికారం సాధించారు. పద్నాలుగు సంవత్సరాల వయసులోనే తూర్పుగోదావరి జిల్లా స్థాయిలో జరిగిన చిత్రకళా పోటీల్లో తను వేసిన చిత్రం ‘ప్రయాణానికి’ ప్రధమ బహుమతి అందుకున్నారు. 1959లో మైసూర్‌లో జరిగిన చిత్రకళా ప్రదర్శనలో తన ‘మధుర స్మృతులు’ చిత్రానికి ఉత్తమ చిత్రంగా బహుమతినందుకున్నారు.
1960లోనే వీర్రాజుగారు రాజమండ్రిలో తన చిత్రకళా ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఎన్.టి.రామారావుగారు దానికి ప్రారంభోత్సవం చేసి, వీర్రాజు గారి కృషిని ఆ తరువాత ‘కృష్ణా పత్రిక’లో మూడు సంవత్సరాల పాటు జర్నలిస్టుగా, చిత్రకారుడిగా పనిచేశారు. 1970లో లేపాక్షి స్కెచ్‌లను ‘శిల్పరేఖ’ పేరుతో ఒక పుస్తకంగా ప్రచురించారు. 45 వాటర్ కలర్స్ పెయింటింగ్స్ తో 1968 మే 30న హైదరాబాద్ కళాభవన్‌లో ఒక సోలో ప్రదర్శన ఇచ్చారు. అలాగే లేపాక్షి శిల్పాల స్కెచ్‌లతో 1970లో హైదరాబాద్‌లో మరో ‘వన్ మాన్ షో’ జరిపారు.
ఆ తరువాత పశ్చిమ జర్మనీ గోటింజన్ నగరంలో వీర్రాజు చిత్రాల ప్రదర్శన జరిగింది. చిత్రకళా విమర్శకుల ప్రశంసల నందుకుంది.
చిత్రకళా రంగంలో ప్రవేశించిన కొన్ని అత్యాధునిక శైలులకు దూరంగా సంప్రదాయ చిత్రకళకు జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి శ్రీ శీలా వీర్రాజు గారు. రచనల్లోనూ, చిత్రకళలోనూ, జీవితంలోనూ అత్యంత నిరాడంబరుడు.