Telugu Global
POLITICAL ROUNDUP

చేటపెయ్య జనసేన

మానవ మాత్రులకు కోపం రావడం సహజం. కడుపు మండినవాడికి కోపం రావడం ఎండాకాలంలో ఎండ అంత వాస్తవం. కోపం మీద ఎన్నిపరిశోధనలు జరిగాయో సరిగ్గా తెలియదు. ఒక వేళ జరిగి ఉంటే భూమ్మీద ఏ జీవికైనా కోపం త‌ప్పదు అని రుజువు అయ్యుంటుదనే అనిపిస్తోంది. ఎందుకంటే.. పవన్‌కల్యాణ్‌కు కూడా ఒక్కసారిగా ఎక్కడా లేని కోపం వచ్చింది. అదీ ఎన్నికల ముందు అకస్మాత్తుగా. ఎవరికైనా కోపం వస్తే ఏమవుతుంది?  ఎంత మహా కోపమైనా కాసేపటికి కరిగిపోతుంది. కానీ పవన్‌కు […]

చేటపెయ్య జనసేన
X

మానవ మాత్రులకు కోపం రావడం సహజం. కడుపు మండినవాడికి కోపం రావడం ఎండాకాలంలో ఎండ అంత వాస్తవం. కోపం మీద ఎన్నిపరిశోధనలు జరిగాయో సరిగ్గా తెలియదు. ఒక వేళ జరిగి ఉంటే భూమ్మీద ఏ జీవికైనా కోపం త‌ప్పదు అని రుజువు అయ్యుంటుదనే అనిపిస్తోంది. ఎందుకంటే.. పవన్‌కల్యాణ్‌కు కూడా ఒక్కసారిగా ఎక్కడా లేని కోపం వచ్చింది. అదీ ఎన్నికల ముందు అకస్మాత్తుగా. ఎవరికైనా కోపం వస్తే ఏమవుతుంది? ఎంత మహా కోపమైనా కాసేపటికి కరిగిపోతుంది. కానీ పవన్‌కు వచ్చిన కోపం జనసేనగా రూపుదాల్చింది. ముఖ్యంగా రాష్ట్రాన్ని విభజించిన తీరు అప్పట్లో అధికారంలో ఉన్న ‘అన్నయ్య’ చిరంజీవి సంగతేమో కానీ ఈ ‘తమ్ముడు’గారికి నచ్చలేదు. ఆ కారణంగా ఏపీకు జరిగిన నష్టం చూసిన ఆయనకు గుండె తరుక్కుపోయి గబ్బర్‌సింగ్‌ అవతారమెత్తి జనసేనను ప్రకటించడం వరకూ వెళ్లిపోయింది. ఆ తరువాతే అసలు ‘సినిమా’ మొదలైంది. అందుకే హీరోగారి కళ్లకు లోకమంతా ‘పసుపు’గా కనిపించింది. చంద్రబాబునాయుడుగారు లోకనాయకుడుగా అనిపించారు.

ఎన్నికల ప్రచారానికి వెళ్లిన పవన్‌ ‘చంద్రబాబునాయుడు రుణమాఫీ చేయకపోతే నన్ను అడగండి’ అన్నారు. ఇంటికో ఉద్యోగం -‘చంద్రబాబు ఇవ్వకపోతే నన్ను నిలదీయండి’ అని కూడా అన్నారు. ఫైలిన్‌ నష్టపరిహారం -‘బాబు చెల్లించకపోతే నన్ను కడిగేయండి’ అని సెలవిచ్చారు. ఇక్కడ బాబు…అక్కడ మోడీ..మధ్యలో నేను… ఇంతకంటే ఏమి కావాలి అన్నారు. ఇంకా అనే కం…అనేకం… వినీ… వినీ.. శభాష్‌ అన్నారు జనం. సభల్లో చప్పట్ల వర్షం…తరువాత ఓట్ల వర్షం. ఏపీలో బాబు, కేంద్రంలో మోడీ వచ్చారు.

అక్కడ కట్‌చేస్తే…

ఏడాది కాబోతోంది. ఏం జరిగిందయ్యా అంటే… పవన్‌ కల్యాణ్‌ దేవుడిగా నటించిన ‘గోపాల గోపాల’ సినిమా మాత్రం రిలీజైంది. కష్టాలు మరచి సినిమా చూసుకోండని సారాంశమో ఏమో కానీ పవన్‌ నుంచి అంతకుమించిన ఓదార్పు ప్రజలకు దక్కలేదు. రుణమాఫీ… ఏపీ కష్టాల్లో ఉంది.. డ్వాక్రారుణాల మాఫీ… కొంచెం టైమ్‌ కావాలి(మళ్లీ ఎన్నికల వరకు)

ఇంటికో ఉద్యోగం…. ఉన్న ఉద్యోగులకే జీతాల్లేవ్‌
మోదీ వచ్చారుగా ప్రత్యేక ప్యాకేజీ…. త్వరలో ఇస్తారు…లేకపోతే ఇవ్వరు

పరిశ్రమలకు రాయితీలు….అంటే ఏమిటి?

ఇదీ లోకనాయకుడు, పవన్‌ చెప్పిన పరిపాలనాధక్షకుడు, అవనీతిరహిత నేత, అభివృద్ధి కారకుడు అయిన చంద్రబాబునాయుడుగారి పాలనా తీరు. ఇలాంటి చారిత్రక సందర్భంలోనే జనసేనకు ఏడాది నిండింది. అయితే ఏడాది కాలంలో పవన్‌ ఏమీ చేయలేదని కూడా చెప్పలేము. ఇటీవలే ఆయన మాసినగడ్డం(ప్రజల్లోకి వచ్చేటప్పుడు ఆయన గెటప్‌)తో తుళ్లూరు వెళ్లి అక్కడ చంద్రబాబు చేస్తున్నది. తప్పు అని చెప్పి, హైదరాబాద్‌ వచ్చి బాబు పాలన బహుబాగు అని కూడా చెప్పి ప్రస్తుతానికి ప్యాకప్‌ అనేశారు. చేటపెయ్య ఎంతపెద్దతైతే మాత్రం ఏం జీవం ఉంటుందని. ఇలాంటి జనసేనకు ఎన్ని సంవత్సరాలైతే ఏం ఉపయోగం?.

ఇప్పుడు కొన్ని మౌలిక‌ ప్రశ్నలు….

అసలు రాజకీయపార్టీ అంటే ఏమిటి?
దాని లక్ష్యాలు అంటే ఏమిటి?
ఎన్నికల్లో పోటీ చేయకపోవడం అంటే ఏమిటి?
అయినా మద్ధతుఇవ్వడం అంటే ఏమిటి?
మద్ధతు ఇచ్చిన వారు గెలిచాక చేస్తున్నదేమిటో చూడకపోవడం అంటే ఏమిటి?
ఎన్నికల హామీలు నేరవేర్చకపోతే చేయాల్సినదేమిటి? చేస్తున్నదేమిటి?
ఇప్పుడు జరుగుతున్న అవినీతి సంగతేమిటి? రైతుల ఆత్మహత్యల సంగతేమిటి?

ఇలాంటివే మరికొన్ని పవన్‌కల్యాణ్‌గారిని అడగాలనుంది. సమాధానం చెప్పే తీరిక,సత్యాన్ని ఒప్పుకునే ధైర్యం… విమర్శను అంగీకరించే సహనం… పవన్‌కల్యాణ్‌కు ఉంటే?….

(ఇటీవల జనసేనకు ఏడాదైన సందర్భంగా)

-సంఘమిత్ర

First Published:  31 March 2015 9:00 AM GMT
Next Story