Telugu Global
National

‘నోటా’కు ఎక్కువ ఓట్లొస్తే.. - సుప్రీం కోర్టులో పిటిషన్‌

నోటా కంటే తక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థులను తదుపరి ఎన్నికల్లో (ఐదేళ్ల పాటు అన్ని ఎన్నికల్లో) పోటీ చేయకుండా చూసేలా నిబంధనలు రూపొందించాలని శివ్‌ ఖేరా తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

‘నోటా’కు ఎక్కువ ఓట్లొస్తే.. - సుప్రీం కోర్టులో పిటిషన్‌
X

సాధారణంగా ఎన్నికల్లో ఏ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వస్తే వారే గెలిచినట్టు నిర్ధారించి ప్రకటిస్తారు. మరి అభ్యర్థుల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే.. అప్పుడు ఏం చేయాలి?. అంటే దానికి సంబంధించి ఎలాంటి నిబంధనలూ రూపొందించలేదు. ఈ నేపథ్యంలో ఈ అంశాలను ప్రస్తావిస్తూ శివ్‌ ఖేరా అనే రచయిత తన పిటిషన్‌ ద్వారా లేవనెత్తిన అంశాలను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఎన్నికల్లో నోటాకు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్‌ నిర్వహించాలని కోరుతూ శివ్‌ ఖేరా తన పిటిషన్‌లో విజ్ఞప్తి చేయడం గమనార్హం.

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాల ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్‌ రాగా.. ఈ అంశంపై కోర్టు భారత ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.

నోటా కంటే తక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థులను తదుపరి ఎన్నికల్లో (ఐదేళ్ల పాటు అన్ని ఎన్నికల్లో) పోటీ చేయకుండా చూసేలా నిబంధనలు రూపొందించాలని శివ్‌ ఖేరా తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాదు.. నోటాను ’కల్పిత అభ్యర్థి’గా తెలియజేస్తూ విస్తృత ప్రచారం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలకు సంబంధించి తగిన నిబంధనలను రూపొందించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరారు.

ఇటీవల సూరత్‌లో పోలింగ్‌ జరగకుండానే ఓ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైన తీరును ఈ సందర్భంగా శివ్‌ ఖేరా తన పిటిషన్‌లో ప్రస్తావించారు. పిటిషనర్‌ చేసిన ఈ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న సుప్రీం ధర్మాసనం.. ఈసీకి నోటీసులు పంపించింది. ఇది కూడా ఎన్నికల ప్రక్రియలో భాగమేనని, దీనిపై ఎన్నికల సంఘం ఏం చెబుతుందో చూద్దామని పేర్కొంది.

2013లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఈవీఎంలలో నోటా ఆప్షన్‌ కల్పించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో ఎవ్వరూ నచ్చకపోతే.. ఈ ’నోటా’ మీట నొక్కే సదుపాయం ఉంది. అయితే, ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే చట్టపరంగా ఎలాంటి పరిణామాలు ఉండవు. ఇటువంటి సందర్భంలో ఎవరికి ఎక్కువగా ఓట్లు వస్తే ఆ అభ్యర్థినే విజేతగా ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో ఈ అంశాలను ప్రస్తావిస్తూ శివ్‌ ఖేరా తన పిటిషన్‌ను దాఖలు చేశారు.

First Published:  26 April 2024 10:54 AM GMT
Next Story