Telugu Global
Andhra Pradesh

మేనిఫెస్టోలో భాగస్వామ్యం ఉందని ఎందుకు చెప్పలేదు?

చంద్రబాబు ఫ్రస్ట్రేషన్‌లో మతిభ్రమించి మాట్లాడుతున్నాడని వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. బాబు, పవన్‌ల మాటలు సభ్యసమాజం తలదించుకునేలా ఉంటున్నాయని ఆయన చెప్పారు.

మేనిఫెస్టోలో భాగస్వామ్యం ఉందని ఎందుకు చెప్పలేదు?
X

రాజమండ్రిలో సోమవారం నిర్వహించిన కూటమి సభలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శలు గుప్పించారు. సోమవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీ, జనసేనతో కలిసి కూటమిలో ఉన్న బీజేపీకి మేనిఫెస్టోలో భాగస్వామ్యం ఉందని మోడీ ఎందుకు చెప్పలేకపోయారని ప్రశ్నించారు.

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ అమలు చేయమని ఎన్డీఏ ప్రభుత్వమే చెప్పిందని ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. హక్కుదారులకు మేలు చేయడానికే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ అని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేదలకు భూములు ఇచ్చే నాయకుడే కానీ లాక్కునే వాడు కాదని ఆయన స్పష్టం చేశారు. అందుకే 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

చంద్రబాబు ఫ్రస్ట్రేషన్‌లో మతిభ్రమించి మాట్లాడుతున్నాడని వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. బాబు, పవన్‌ల మాటలు సభ్యసమాజం తలదించుకునేలా ఉంటున్నాయని ఆయన చెప్పారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని స్పష్టం చేశారు. చంద్రబాబే భూములు లాక్కున్న వ్యక్తి అని వైవీ చెప్పారు. అమరావతి పేరుతో భూములు లాక్కున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పేద ప్రజలు వీరి తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని ఆయన కోరారు. పింఛన్లను అడ్డుకొని లబ్ధిదారుల మరణానికి కారణమైన దుర్మార్గుడు చంద్రబాబని ఆయన చెప్పారు.

కూటమిలో చేరిన తరువాత బీజేపీ తీరులో మార్పు వచ్చిందని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పాలనపై కేంద్రం ఆధీనంలో ఉండే నీతి అయోగ్‌ ప్రశంసించిందని గుర్తుచేశారు. చంద్రబాబు, పవన్‌ ఇచ్చిన స్క్రిప్ట్ మోడీ చదివారని ఆయన చెప్పారు. స్టీల్‌ ప్లాంట్‌ కాపాడుకోవడం కోసం వైఎస్సార్సీపీ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

First Published:  7 May 2024 2:31 AM GMT
Next Story