Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు పక్కా కన్ఫ్యూజన్‌ పొలిటీషియన్‌.. - సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, రామాయపట్నం పోర్టు, కడప స్టీల్‌ప్లాంట్‌ వంటివి ఏవీ మోడీ ప్రభుత్వం ఇవ్వలేదని రామకృష్ణ విమర్శించారు.

చంద్రబాబు పక్కా కన్ఫ్యూజన్‌ పొలిటీషియన్‌.. - సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
X

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పక్కా కన్ఫ్యూజన్‌ పొలిటీషియన్‌ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. ఆదివారం విజయవాడలో ఆయన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రస్తుత ఎన్నికల్లో ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ గురించి వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తుండటంపై ఆయన స్పందిస్తూ.. అసలు ఆ చట్టం తెచ్చిందే బీజేపీ అని చెప్పారు. ఆ బీజేపీతోనే పొత్తులో అంటకాగుతూ.. ఆ పార్టీ తెచ్చిన చట్టంపై విమర్శలు చేయ‌డం బాబు గందరగోళ రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు.

ఓ వైపు ఆర్‌ఎస్‌ఎస్‌ రిజర్వేషన్లు రద్దు చేయాలంటుంటే, బాబు ఎన్డీయే కూటమిలో చేరి ముస్లింలకు 4% రిజర్వేషన్‌ కోసం పోరాడతానని చెబుతున్నారని, అంతగా పోరాడటానికి అసలు ఎన్డీయే కూటమిలో ఎందుకు చేరారో చెప్పాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు. గతంలో ఈ రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం ఏం చేయలేదని బాబు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడేమో ఎన్డీయే నుంచి సహకారం వస్తుందని చెబుతున్నాడన్నారు. అసలు బాబు అప్పుడు చెప్పింది కరెక్టా? ఇప్పుడు చెబుతోంది కరెక్టా? చెప్పాలని నిలదీశారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, రామాయపట్నం పోర్టు, కడప స్టీల్‌ప్లాంట్‌ వంటివి ఏవీ మోడీ ప్రభుత్వం ఇవ్వలేదని రామకృష్ణ విమర్శించారు. పైగా వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ని ప్రైవేటీకరిస్తామని అంటోందని గుర్తుచేశారు. అలాంటి పార్టీతో చంద్రబాబు ఎలా పొత్తు పెట్టుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలపై స్పందిస్తూ.. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.

First Published:  6 May 2024 2:39 AM GMT
Next Story