Telugu Global
Andhra Pradesh

అందుకే కన్నీళ్లు -బొత్స

2014లో చంద్రబాబు వంటి దద్దమ్మ ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఇప్పుడు కూటమి కట్టిన నేతలే అప్పుడు కూడా కూటమిలో ఉన్నారని చెప్పారు మంత్రి బొత్స.

అందుకే కన్నీళ్లు -బొత్స
X

ఇటీవల మేమంతా సిద్ధం సభలో మంత్రి బొత్స తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది. వైసీపీ అభ్యర్థిగా సీఎం జగన్ తనను పరిచయం చేసే క్రమంలో తనకు కన్నీళ్లు వచ్చాయన్నారు మంత్రి బొత్స. జగన్‌ తనను తండ్రితో పోల్చినప్పుడు దివంగత నేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి గుర్తొచ్చారని, జగన్‌ తన పేరు పిలవగానే జనం కూడా బాగా స్పందించారని, అందుకే భావోద్వేగానికి గురయ్యానని వివరించారు.

ఏపీ విద్యాశాఖలో అవినీతి జరగలేదని, ఈ విషయంలో కొన్ని పత్రికలు దురుద్దేశంతో కథనాలు రాసి ప్రజల్ని నమ్మించాలని చూస్తున్నాయని మండిపడ్డారు మంత్రి బొత్స. రాష్ట్రంలో ఏ ఒక్క అధ్యాపకుడైనా విద్యాశాఖ మంత్రిగా ఉన్న తనను వేలు ఎత్తి చూపించగలరా? విద్యాశాఖలో అవినీతి జరిగిందని చెప్పగలరా? అని ప్రశ్నించారాయన. రాష్ట్ర విద్యావ్యవస్థలో తీసుకొచ్చిన మార్పుల వల్లే ఈసారి మంచి ఫలితాలు వచ్చాయని, 10వతరగతి పరీక్షల్లో రికార్డ్ స్థాయి ఫలితాలు వచ్చాయని చెప్పారు బొత్స.

చంద్రబాబు దద్దమ్మ..

2014లో చంద్రబాబు వంటి దద్దమ్మ ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఇప్పుడు కూటమి కట్టిన నేతలే అప్పుడు కూడా కూటమిలో ఉన్నారని చెప్పారు మంత్రి బొత్స. అప్పుడు రైల్వే మంత్రిగా ఉన్న పీయూష్ గోయల్ ఎందుకు రైల్వే జోన్ ఇవ్వలేదని ప్రశ్నించారు. .రైల్వే జోన్ కోసం 52 ఎకరాల భూమిని వైసీపీ ప్రభుత్వం కేటాయించిందని, అడ్డంకులన్నీ తొలగించి రైల్వే జోన్ కోసం భూములు అప్పగించామని వివరించారు. అప్పుడు చేయలేని పనుల విషయంలో ఈ ప్రభుత్వాన్ని తప్పుబట్టడం బీజేపీకి ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు బొత్స. 2014-19 మధ్య కేంద్రంలో ఉన్నది సింగిల్‌ ఇంజిన్‌ ప్రభుత్వమా?.. మధ్యలో ఒక ఇంజినే పని చేసిందా? మరో ఇంజిన్‌ రిపేర్‌ అయ్యిందా? అని ఎద్దేశా చేశారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికగా జరిగే కేటాయింపు అని, దళితుల రిజర్వేషన్లు తగ్గించాలని చూస్తే బీజేపీ మట్టి కొట్టుకుపోతుందని అన్నారు మంత్రి బొత్స.

కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ రాకూడదని, ఏపీ ఎంపీ సీట్లపై ఆధారపడే పార్టీ అధికారంలోకి రావాలని తాము కోరుకుంటున్నట్టు తెలిపారు మంత్రి బొత్స. అలా వస్తేనే రాష్ట్రానికి రావాల్సిన మరికొన్ని ప్రయోజనాలు సాధించుకోవచ్చని అన్నారు.

First Published:  26 April 2024 12:53 PM GMT
Next Story